Begin typing your search above and press return to search.

ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే, ఆ డాక్టర్ ఏంచేసాడంటే ?

By:  Tupaki Desk   |   15 July 2020 4:00 PM GMT
ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే, ఆ డాక్టర్ ఏంచేసాడంటే ?
X
ఒకవైపు దేశంలో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తుంటే , తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టి ఎంతోమంది వైద్యులు, నర్సులు ప్రాణాలకు తెగించి మరీ కరోనా పేషేంట్స్ కి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇటువంటి సమయంలో కూడా కొంతమంది డాక్టర్లు వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హర్యానాలోని సివిల్ హాస్పిటల్‌ లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కరోనా రోగులకు సహాయం చేస్తున్న ఓ నర్సు పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో వైద్యుడు. అయితే , ఈ వ్యవహారం పై ఆసుపత్రి నిర్వహకులు సరిగ్గా స్పందించలేదని మండిపడిన నర్సులు ఆ నీచపు డాక్టరుపై దాడి చేసారు.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ....హర్యానాలోని పంచకుల సెక్టార్ 6 లోని సివిల్ హాస్పిటల్‌ లో కరోనా డ్యూటీలో ఉన్న నర్సుపై డాక్టర్ మనోజ్ కుమార్ అనే మానసిక వైద్యుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. దీనిపై నర్సుల సంఘం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే , ఆసుపత్రి వైద్యుడి పట్ల సరైన చర్యలు తీసుకోలేదని కఠినంగా వ్యహరించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నర్సులు మనోజ్‌కుమార్‌పై దాడి చేసి చితక్కొట్టారు. మంగళవారం విచారణ సందర్భంగా చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

నర్సుల సంఘం అధ్యక్షురాలు కమల్జీత్ కౌర్ సమాచారం ప్రకారం కరోనా ఐసోలేషన్ విధుల్లో ఉండగా శనివారం రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు మద్యం సేవించి ఉన్న కుమార్ వార్డుకొచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధిత స్టాఫ్ నర్సును సహాయం కోరుతూ ఆమెను నర్సింగ్ గదికి పిలిచాడు. ఆమె గది లోపలికి వెళ్ళినప్పుడు, తలుపు వేసి, ఆమెపై దాడి చేశాడు. మాస్క్‌ను తొలగించి లైంగికంగా వేధించాడు. ఆ కీచక డాక్టర్ వేధింపులతో భయపడిపోయిన నర్సు పెద్దగా కేకలు వేస్తూ అక్కడి నుంచి తప్పించుకుంది. విషయం తెలుసుకున్న ఆస్పత్రి ఆర్‌ ఎంవో, పీఎంవో అక్కడికి చేరుకుని వైద్యుడిని ఐసీయూకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘటనపై నర్సులు యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో విచారణకు నలుగురు సభ్యులతో కమిటీ వేశారు. అయితే కమిటీలో సభ్యుడిగా ఉన్న డాక్టర్ రాలేదని విచారణ జరపకపోవడంతో నర్సుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లైంగిక దాడికి యత్నించిన డాక్టర్‌ని నర్సులు చితకబాదారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధికారులు ఎవరైనా చర్యలు తీసుకుంటారేమోనని తాము రెండు రోజుల పాటు వెయిట్ చేశామని కమల్జీత్ కౌర్ తెలిపారు. అంతేగాకుండా..బాధితురాలిని మూడు రోజుల సెలవుపై పంపారని, కేసు నమోదు చేయడానికి వెళితే..మహిళా పీఎస్ కు వెళ్లాలని అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. దీంతో తాము మహిళా కమిషన్ ను ఆశ్రయించినట్లు తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం వైఖరిపై మహిళా కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.