ఈయన వల్ల పార్టీకి ఏమన్నా ఉపయోగమా ?

Thu May 12 2022 16:00:01 GMT+0530 (IST)

Not even a leader who is loyal to a party

ఇపుడిదే ప్రశ్న నెల్లూరు అధికార పార్టీ నేతల్లో మొదలైంది. పైగా ఈయనేమో ఒక పార్టీకి విశ్వాస పాత్రంగా ఉండే నేత కూడా కాదు. ఇప్పటికే చాలా పార్టీలు మారారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఎవరు పీసీసీ చీఫ్ గా ఉంటే వారితో అతుక్కునుండేవారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ నేత ఇపుడు దాదాపు అవుట్ డేటెడనే చెప్పుకోవాలి. ఎప్పుడో 1970ల్లో ఎంఎల్సీగా పనిచేశారు. తర్వాత ఎప్పుడూ అధికారిక పదవుల్లో ఉన్నట్లులేరు.ఈయన వైఖరి పార్టీ నేతలకు నచ్చని కారణంగా జిల్లాలోని చాలామంది నేతలు ఈయనతో దూరంగానే ఉంటారు. కాంగ్రెస్ నుండి వచ్చేసిన తర్వాత ప్రజారాజ్యంలో కూడా చేరారు. అక్కడి నుండి మళ్ళీ జనసేనలో చేరారు. ఈరోజు అంటే బుధవారం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాడేపల్లి క్యాంపు ఆఫీసులో వైసీపీ కండువా కప్పుకున్నారు. మాదాసుపైన ఐరన్ లెగ్ అనే ముద్ర చాలా కాలంగా ఉంది.

ఏ పార్టీలో ఉన్నా పవర్ సెంటర్ గానే ఉండాలని కోరుకుంటారు కాబట్టే తొందరగానే ప్రత్యర్ధులు తయారవుతారనే ప్రచారం ఉంది. జనసేనలో ఉన్నపుడు డైరెక్టుగా పవన్ కల్యాణ్ తోనే విబేధాలు మొదలయ్యాయి.

ఈయనిచ్చిన సూచనలు సలహాలను పవన్ పట్టించుకోలేదనే కారణంతో మాదాసులో తీవ్ర అసంతృప్తి ఉండేది. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటి కన్వీనర్ గా పనిచేసిన మాదాసుకి ఇతర నేతలతో ఏ మాత్రం పడేదికాదనే ప్రచారముంది. అందుకనే ఆ పార్టీలో ఇమడలేకపోయారు.

విచిత్రమేమిటంటే ప్రతిపక్షమైన జనసేనలోనే ఇమడలేకపోతే ఇక అధికార వైసీపీలో ఏమి ఇమడగలుగుతారు ? ఇప్పటికే జిల్లాలో మంత్రి-కొందరు ఎంఎల్ఏల మధ్య పొసగటం లేదు. పైగా రెండేళ్ళల్లో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఎంఎల్ఏ వాళ్ళ నియోజకవర్గాల్లో ఫుల్లుగా యాక్టివిటి చేసుకుంటున్నారు.

ఈ దశలో పార్టీలో చేరి ఏమి చేయగలుగుతారు అనేదే డౌటు. ఈయన దగ్గరనుండి జగన్  సలహాలు తీసుకునేదేమీ ఉండదు. మంత్రులు కానీ ఎంఎల్ఏలు కానీ ఈయన సలహాలు వినేవారుండరు. మరలాంటపుడు ఉన్న నేతల మధ్య గ్యాప్ పెరగటం తప్ప ఉపయోగమే లేదనే టాక్ మొదలైంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.