Begin typing your search above and press return to search.

సెకండ్ వేవ్ లో ఒక్కరు కూడా ఆక్సీజన్ లేక మరణించలేదట !

By:  Tupaki Desk   |   21 July 2021 5:29 AM GMT
సెకండ్ వేవ్ లో ఒక్కరు కూడా ఆక్సీజన్ లేక మరణించలేదట !
X
కరోనా వైరస్ సెకండ్ వేవ్ దేశంలో ఎంతటి విలయాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలో మొదటి వేవ్ చూపించిన విధ్వంసం కంటే , నాలుగు రేట్లు ఎక్కువగా ప్రభావం చూపించింది. రోజుకి నాలుగున్నర లక్షలకి పైగా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వేల సంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి. సెకండ్ వేవ్ లో నమోదు అయిన మరణాల్లో ఎక్కువశాతం ఆక్సీజన్ అవసరం అయిన సమయంలో అందుబాటులో లేకపోవడం వల్లే జరిగాయి అని ఎవరైనా చెప్తారు. ఎందుకు అంటే ఆ సమయంలో ప్రభుత్వాలు , కోర్టులు , మీడియా ఆక్సీజన్ గురించి అంతగా మాట్లాడాయి. లక్షల మంది రోగులు ఆక్సిజన్ లేక విలవిల్లాడటం, పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా వేల మంది చనిపోవడాన్ని జనం ప్రత్యక్షంగా చూసినా ప్రభుత్వాలకు మాత్రం ఆక్సిజన్ మరణాలు ఒక్కటి కూడా కనిపించలేదట.

అయితే, ప్రభుత్వాలు ఏ సమయంలోను తమ తప్పిదం వల్ల మనుషులు చనిపోయారని వారు అంగీకరించరు. ఇప్పుడు కూడా పార్లమెంట్‌ లో అదే సీన్ రిపీట్ అయ్యింది. తాజాగా రాజ్యసభలో కరోనా అంశంపై జరిగిన చర్చలో ఆక్సిజన్ కొరత కారణంగా ఒక్కరంటే ఒక్కరు కూడా దేశంలో చనిపోలేదని కేంద్రం ఓ కీలకమైన భారమైన స్టేట్ మెంట్ ఇచ్చింది. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత వల్ల రోగులు మరణించినట్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నిర్దిష్టమైన సమాచారం లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపింది. తొలి వేవ్ కంటే రెండో వేవ్ లో మెడికల్ ఆక్సిజన్ కు డిమాండ్ పెరిగిందని మాత్రం మోదీ సర్కారు అంగీకరించింది. తొలి వేవ్ సమయంలో 3,095 మెట్రిక్ టన్నులుగా ఉన్న మెడికల్ ఆక్సిజన్ డిమాండ్, రెండో వేవ్ సమయంలో 9,000 మెట్రిక్ టన్నులకు పెరిగిందని, స్వయంగా తానే రంగంలోకి దిగి, రాష్ట్రాలన్నిటికీ సమానంగా మెడికల్ ఆక్సిజన్ పంపిణీ చేశామని కేంద్రం వెల్లడించింది.

పార్లమెంట్ సమావేశాల రెండో రోజైన మంగళవారం కూడా కరోనా పరిస్థితుల నిర్వహణలో మోదీ సర్కారు వైఫల్యంపై విపక్షాలు ఆందోళన చేశాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలు, మొత్తం మరణాల సంఖ్య దాచివేత ఆరోపణలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాడవీయ, అదే శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ సమాధానాలిచ్చారు. వైద్యం, ఆరోగ్యం అనేవి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని అంశాలన్న కేంద్రం, ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రతి నిత్యం కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాయని, మరణాలను నివేదించవలసిన విధానంపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సవివరమైన మార్గదర్శకాలను జారీ చేశామని, అయితే ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలంటూ నిర్దిష్టంగా తెలియజేయలేదని కేంద్ర మంత్రులు పార్లమెంటుకు తెలిపారు.

ఆక్సీజన్ కొరత కారణంగా ఓ ఒక్కరు చనిపోలేదు అని దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా కేంద్రానికి సమాచారం ఇవ్వలేదట. ఆక్సిజన్ కొరత లేకపోతే, మనుషులు పిట్టల్లా రాలిపోకపోతే ప్రపంచం మొత్తం ఉరుకులు పరుగుల మీద ఎందుకు ఇండియాకు ఆక్సిజన్ పంపిందో కేంద్రం చెప్పాల్సి ఉంది. వందల కొద్ది మరణాలు శ్మశానాల ముందు బారులు తీరిన మృతదేహాలు ఆక్సిజన్ కోసం కోర్టుకెళ్లిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి వార్తలతోనే సెకండ్ వేవ్ నడిచిపోయింది. ఏపీలో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 30మందికిపైగా చనిపోయారని ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇచ్చింది. ఇవేమీ లెక్కలోకిరాలేదు. చివరికి ధర్డ్ వేవ్ వస్తుందన్న ఆందోళన.. సెకండ్ వేవ్ లాంటి పరిస్థితులు రిపీట్ కాకుండా ఉండాలన్న లక్ష్యంతో వేల కొద్దీ ఆక్సిజన్ ప్లాంట్‌ ల కు కేంద్రం నిధులిస్తోంది. ఇన్ని జరుగుతున్నా కూడా దేశంలో ఆక్సిజన్ కొరత కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదు అంటూ దేవాలయం వంటి రాజ్యసభ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.