Begin typing your search above and press return to search.

మోదీ సర్కారుపై నోబెల్ బహుమతి గ్రహీత విమర్శలు..!

By:  Tupaki Desk   |   28 Jan 2023 7:00 PM GMT
మోదీ సర్కారుపై నోబెల్ బహుమతి గ్రహీత విమర్శలు..!
X
కేంద్రంలో గత రెండు పర్యాయాలు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రోజురోజుకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతుండగా ప్రతిపక్షాలు మాత్రం క్రమంగా బలహీనపడుతున్నాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ బీజేపీని దేశంలోని తిరుగులేని శక్తిగా మారుస్తున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాదిలో బీజేపీ క్రమంగా బలపడుతూ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది.

అయితే బీజేపీ అనుసరిస్తున్న హిందుత్వ విధానంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ ద్వంద్వ వైఖరిపై ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీత.. ఆర్థికవేత్త అమర్త్యసేన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలోనూ ఆయన మోదీ సర్కారు తీరును ఎండగట్టారు. ఈ క్రమంలోనే అమర్త్యసేన్ ‘ది వైర్’ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి బీజేపీ తీరును తూర్పార పట్టడం చర్చనీయాంశంగా మారింది.

పార్లమెంటు ఉభయ సభల్లో బీజేపీ తరఫున ఒక్క ఎంపీ కూడా లేకపోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని.. ఇది చాలా అనాగరికమని అమర్త్యసేన్ విమర్శలు గుప్పించారు. కిరణ్ థాపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బీజేపీ సర్కారు అతి సంకుచిత సమూహ వాదంతో నడుస్తుందని తాను ఫ్రెంచ్ పత్రిక లెమాండ్ కు గతంలో చెప్పిన విషయాలను గుర్తు చేసుకున్నారు.

భారతదేశం ఎప్పటి కూడా విభిన్న జాతుల సమూహమేనని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచంలోని ఘోరమైన ప్రభుత్వాల్లో మోదీ సర్కారు ఒకటని ఆయన విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ముస్లింల పట్ల అనుసరిస్తున్న విధానం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఉభయ సభల్లో ఆ పార్టీకి ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకపోవడం ఏంటని ప్రశ్నించారు.

ఈ చర్య చాలా అనాగరికమని అన్నారు. ప్రభుత్వ తీరు అన్యాయం.. అక్రమమే కాదని.. ప్రజల జీవితాలకు సైతం ప్రమాదకరంగా పరిగణిస్తుందని అమర్త్యసేన్ అన్నారు. ఇలాంటి చర్యల వల్ల భారతీయ సంస్కృతి కుంచించుకు పోతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై దాడులు చేస్తూ హిందూ భావనను ముందుకు తెస్తుందందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.