Begin typing your search above and press return to search.

ఇవాల్టి నుంచి ఆ ఉద్యోగులకు ఇంటి నుంచి పని బంద్!

By:  Tupaki Desk   |   13 Sep 2021 5:41 AM GMT
ఇవాల్టి నుంచి ఆ ఉద్యోగులకు ఇంటి నుంచి పని బంద్!
X
కరోనా మహమ్మారి కారణంగా గడిచిన ఏడాదిన్నరకు పైనే ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మాటకు వస్తే.. ఒక్క ఐటీ ఉద్యోగులు మాత్రమే కాదు.. వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులందరికి వర్కు ఫ్రం హోం సదుపాయాన్నికల్పించారు. మొదటి వేవ్ ముగిశాక.. ఆఫీసుకు వచ్చి పని చేయాలన్న ఆదేశాల్ని ఉద్యోగులకు ఇవ్వాలన్న ఆలోచనలో ఐటీ కంపెనీలు ఉన్న వేళలో.. అనూహ్యంగా విరుచుకుపడిన సెకండ్ వేవ్ దెబ్బకు మళ్లీ వర్కు ఫ్రం హోం విధానాన్ని కొనసాగించారు.

సెకండ్ వేవ్ తాకిడి నుంచి గడిచిన కొంతకాలంగా బయటపడటం తెలిసిందే. కేసులు నమోదు అవుతున్నా.. తీవ్రత అంతగా లేకపోవటం.. అన్ని రోటీన్ స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ మధ్యనే స్కూళ్లు కూడా తెరుచుకున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. ఇంటి నుంచి పని చేసే విధానానికి పుల్ స్టాప్ పెట్టేసి.. ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాలంటూ ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. ఇలాంటి వేళలో.. వర్కు ఫ్రం హోంకు ఫుల్ స్టాప్ పెట్టి.. ఆఫీసుకు వచ్చేయాలన్న క్లియర్ కట్ ఆదేశాల్ని ఇచ్చిన అతి పెద్ద ఐటీ కంపెనీల్లో విప్రో ముందు ఉండనుంది. సోమవారం నుంచి తమ ఉద్యోగులంతా ఆఫీసుకు వచ్చి పని చేయనున్నట్లుగా విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీ వెల్లడించారు.

కరోనా కారణంగా గడిచిన పద్దెనిమిది నెలలుగా తమ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారని.. సోమవారం నుంచి తమ ఉద్యోగుల్లో పలువురు వారంలో రెండుసార్లు ఆఫీసుకు రానున్నట్లు చెప్పారు. అందరూ పూర్తిగా టీకాలు వేయించుకోవటంతో పాటు.. సురక్షితంగా.. భౌతిక దూరంతో పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెబుతన్నారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన ఒక వీడియోను షేర్ చేశారు.

ప్రస్తుతం విప్రోలో రెండు లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 55 శాతం మందికి పూర్తిస్తాయి వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి వారంలో కొన్ని రోజులు ఇంట్లో.. మరికొన్ని రోజులు ఆఫీసులో పని చేసే వినూత్న విధానాన్ని అమలు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. కొంతకాలం పాటు ఈ విధానాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత.. పూర్తిస్తాయి ఆఫీసు లో వర్కు చేసే విధానాన్ని అమలు చేయనున్నట్లు చెబుతున్నారు.