Begin typing your search above and press return to search.

మోడీషాల సంచలనం.. గుజరాత్ లో నో రిపీట్ ఫార్ములా వర్కువుట్ అయ్యేనా?

By:  Tupaki Desk   |   17 Sep 2021 12:30 AM GMT
మోడీషాల సంచలనం.. గుజరాత్ లో నో రిపీట్ ఫార్ములా వర్కువుట్ అయ్యేనా?
X
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాలు కలిసి గుజరాత్ రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించిన కొత్త ఫార్ములాను అనుసరించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. తమ సొంత రాష్ట్రానికి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారి నిర్ణయం సాహసోపేతమైనదిగా చెప్పాలి. మూడు రోజుల క్రితం గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో భూపేంద్ర పటేల్ ను కూర్చోబెట్టిన వారు.. తాజాగా 24 మందితో కూడిన కొత్త మంత్రివర్గం చేత ప్రమాణస్వీకారాన్ని చేయించారు.

ఇందులో పది మంది కేబినెట్ మంత్రులు కాగా.. పద్నాలుగు మంది సహాయ.. స్వతంత్ర మంత్రులు కావటం గమనార్హం. షాకింగ్ నిజం ఏమంటే.. కొత్తగా కొలువు తీరిన మంత్రివర్గంలో ఒక్కరంటే ఒక్కరు కూడా పాత వారు లేకపోవటం. చాప చుట్టేసినట్లుగా పాత మంత్రివర్గాన్ని పక్కన పెట్టేసి.. మంత్రివర్గం మొత్తాన్ని కొత్త వారితో నింపేయటం గమనార్హం. గత ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ కేబినెట్ లో ఎవరికి స్థానం చిక్కకపోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన రాజేంద్ర త్రివేదిని కూడా కేబినెట్ లో తీసుకున్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారానికి కాస్త ముందుగా తన స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో.. కొత్త స్పీకర్ ను త్వరలో ఎన్నుకోనున్నారు. తాజాగా ప్రమాణస్వీకారం చేసిన 24 మందిలో 21 మంది తొలిసారి మంత్రి పదవిని చేపడుతుండటం మరో విశేషంగా చెప్పాలి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే అన్న విషయం తెలిసిందే.

‘నో రిపీట్’ ఫార్ములాను అనుసరించి.. కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయించిన మోడీషాల వ్యూహం వచ్చే ఎన్నికల్లో ఎంతమేర పని చేస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పటికే గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్న ఫీడ్ బ్యాక్ తో ముఖ్యమంత్రిని.. మంత్రివర్గాన్ని మార్చేసిన మోడీషాలు.. వినూత్నమైన ఫార్ములాను అనుసరించటం బాగానే ఉన్నా.. దీని ఫలితం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో బలమైన పటేల్ వర్గానికి తాజా మంత్రివర్గంలో ఆరుగురికి స్థానం లభించింది. మరి.. ఈ సాహసోపేతమైన ఫార్ములా మోడీషాలు కోరుకున్న విజయాన్ని తెచ్చి పెడుతుందా? లేదా? అన్నది తేలాలంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.