Begin typing your search above and press return to search.

హైదరాబాద్ రెండో రాజధానిపై నోరువిప్పిన కేంద్రం

By:  Tupaki Desk   |   17 Nov 2019 10:53 AM GMT
హైదరాబాద్ రెండో రాజధానిపై నోరువిప్పిన కేంద్రం
X
దేశానికి హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయబోతున్నారని.. పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతంగా మారబోతోందని కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ రెండో రాజధాని అయితే దీని ఆదాయం మొత్తం కేంద్రానికి వెళ్లి తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఇక్కడి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీడియాలోనూ దీనిపై పెద్ద చర్చ సాగుతోంది. దీంతో ఈ విషయంలో కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయాలన్న ప్రతిపాదన ఏదీ కేంద్రం వద్ద పరిశీలనలో లేదు’ అని మీడియాకు క్లారిటీ ఇచ్చారు. కొన్ని చానెల్స్ పనిగట్టుకొని ఈ వివాదాన్ని రాజేస్తూ చర్చలు పెడుతున్నాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం కేంద్రం నిర్ణయం తీసుకోదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

అయితే కిషన్ రెడ్డి ఎంత ఖండించినా ఈ చర్చను తెరపైకి తెచ్చింది సీనియర్ బీజేపీ నేత విద్యాసాగర్ రావు కావడం గమనార్హం. ఈయన మొన్నటి వరకు మహారాష్ట్ర గవర్నర్ గా చేసి రావడంతో ఆయన నోటి నుంచి వచ్చిన మాటను మీడియా హైలెట్ చేసింది. అంబేద్కర్ స్వయంగా హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయాలని చెప్పిన మాటను బీజేపీ అనుసరించాలని ఆయన కోరారు.

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ సమావేశాల్లో హైదరాబాద్ రెండో రాజధాని అంశం చర్చకు వస్తుందా లేదా మరే ఇతర కీలక బిల్లులను తెరపైకి తెస్తారనేది వేచిచూడాలి.