Begin typing your search above and press return to search.

ఉచితం అంటే ఓటు పడదా....గుజరాత్ తీర్పు వైసీపీకి షాక్

By:  Tupaki Desk   |   10 Dec 2022 1:30 AM GMT
ఉచితం అంటే ఓటు పడదా....గుజరాత్ తీర్పు వైసీపీకి షాక్
X
ఉచిత పధకాల మీద జనాలకు మోజు లేదా. ఉచితంగా ఇస్తామంటే మొహం తిప్పుకుంటున్నారా అంటే తాజాగా గుజరాత్ జనాల తీర్పు చూస్తే అలాగే ఉంది అనుకోవాల్సి ఉంది. ఉచిత పధకాలు ఎన్నో ప్రకటించినా విపక్షాలకు ఓట్లు పడలేదు. పైగా ఎన్నడూ లేని విధంగా వీక్ చేసి పారేశారు. మీ ఫ్రీ స్కీం మాకొద్దు బాబూ అంటూ రెండు చేతులూ ఎత్తి దండం పెట్టేశారు.

అదే టైం లో ఉచిత పధకం ఒక్కటి కూడా ప్రకటించకుండా బీజేపీ అద్భుతమైన విజయం సాధించింది. గుజరాత్ లో అభివృద్ధి ఏం చేశారో బీజేపీ నేతలు చెప్పారు. ఇంకా ఏమి చేస్తామో కూడా ఒక విజన్ని ముందు పెట్టి ఓట్లు అడిగారు. నర్మదా నది నీటిని ప్రజలకు అందించామని, గుజరాత్ లో ప్రగతి గతిని మార్చామని బీజేపీ చెప్పుకుని మరీ ఓట్లు అడిగింది.

మరో వైపు చూస్తే ఆప్ ఎన్నికల మ్యానిఫేస్టో నిండా ఉచిత పధకాలే ఉన్నాయి. ఏకంగా 200 దాకా విద్యుత్ యూనిట్లు ఇచితంగా ఇస్తామని చెప్పింది. మహిళలకు నెలకు రెండు వేల రూపాయలు వంతున సామాజిక పించన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఉచితంగా సైకిళ్ళు, మోపెడ్స్ కూడా ఇస్తామని ఆశ పెట్టింది. ఒక్కటేమిటి అనేక పధకాలు ఉచితంగా ఇస్తామని చెప్పినా గుజరాత్ ఓటర్లు ఆ వైపు తొంగి చూడలేదు.

మరో వైపు కాంగ్రెస్ కూడా ఉచిత హామీలను చాలానే గుప్పించింది. తమ ప్రభుత్వం రావాలే కానీ కాదేదీ ఉచితం అన్నట్లుగా కాంగ్రెస్ ఉచితాలతో హోరెత్తించింది. మరి ఇంత చేసినా బీజేపీ వైపే ఓటర్లు మొగ్గు చూపారు అంటే ఆ ఫలితాన్ని ఎలా చూడాలి. ఏలా విశ్లేషించాలి. అంటే ఇక్కడ ఓటర్లు ఉచితాలు వద్దు మాకు అభివృద్ధి కావాలి అనే అంటున్నారు అనుకోవాలి.

ఉచిత పధకాలు ఇస్తే అవి తాత్కాలికం, అదే అభివృద్ధి చేసి పెడితే శాశ్వతం, ఆ అభివృద్ధి వల్ల అంతా బాగుపడతారు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఇపుడు ఇదే రకమైన ఆలోచన ఓటర్లలో కలుగుతోంది. అందుకే హిమాచల్ ప్రదేశ్ లో ఫలితాలు కూడా అలాగే వచ్చాయని అంటున్నారు. ఎక్కడా ఆప్ ఉచిత పధకాలకు ఓట్లు రాలలేదు. మరి దీని భావమేమి ఓటరా అని అడిగితే కచ్చితంగా మా కష్టార్జితం పన్నులతో మాకే ఉపయోగపడే పనులు చేయండి సామీ అని అడుగుతున్నారన్న మాట.

పన్నులు అందరి వద్దా గుంజి వాటితో ఏ పది మందితో తాయిలాలు ఇచ్చి ఓట్లేయించుకుని అందరి మీద స్వారీ చేద్దామంటే కుదిరే రోజులు కావని కూడా అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే వైసీపీ పూర్తిగా ఉచిత పధకాలను అమలు చేస్తోంది. వాటి మీదనే రేపటి ఎన్నికల్లో విజయం మీద ఆశలు పెట్టుకుంది మరి గుజరాత్ ఫలితాలను చూసి ఇంకా చేతిలో ఉన్న విలువైన సమయాన్ని వాడుకుంటుందా అన్న చర్చకు వస్తోంది.

మిగిలిన ఈ కాలంలో అయినా అభివృద్ధిని చేసి చూపించడం ద్వారా జనాల వద్దకు వెళ్తే ఎంతో కొంత మేలు జరుగుతుంది తప్ప ఉచితాలను నమ్ముకుంటే ఓటరన్న శతకోపం పెట్టేస్తారని గుజరాత్ రిజల్ట్స్ పక్కాగా ప్రూవ్ చేశాయి అని అంటున్నారు. సో ఫ్రీ స్కీమ్ అని ఒక్క వైసీపీయే కాదు ఏ విపక్షం అనాలనుకున్నా ఒకటికి పది సార్లు గుజరాత్ ఫలితాలను మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ప్రజల సొమ్ముతో డెవలప్మెంట్ చేస్తామని ఏ పార్టీ ముందుకు వస్తుందో వారి వైపే జనాల మొగ్గు ఉంటుందని గుజరాత్ తీర్పు తేల్చేసింది అని అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.