Begin typing your search above and press return to search.

జగన్ కు మోదీ షాక్..హోదా మాటే లేదట

By:  Tupaki Desk   |   24 Jun 2019 4:45 PM GMT
జగన్ కు మోదీ షాక్..హోదా మాటే లేదట
X
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని తనదైన శైలి వాదన చేస్తున్న ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిగ్ షాకే ఇచ్చేశారు. ఏపీకే కాకుండా ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదంటూ మోదీ సర్కారు తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా మోదీ సర్కారు ఈ మాటను గట్టిగానే చెప్పేసింది. లోక్ సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు రాతపూర్వక సమాధానాన్ని ఇచ్చారు. ఏపీతో పాటు దేశంలోని ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని గతంలో చెప్పిన మాటనే తాజాగా నిర్మలా చెప్పేశారు. దేశంలోని ఏపీ - తెలంగాణలతో పాటు మొత్తంగా ఏడు రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కోరుతున్నాయని - అయితే ఏపీ సహా ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని నిర్మలా చాలా క్లియర్ గానే ప్రకటన చేశారు.

ఈ ప్రకటన ద్వారా మోదీ సర్కారు... కొత్తగా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జగన్ కు పెద్ద షాకే ఇచ్చేశారని చెప్పాలి. తాజాగా ముగిసిన ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో విక్టరీ సాధించగా... ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెల 30న ఏపీకి నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఎంగా పదవీ ప్రమాణం చేయకముందే... ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణమే డిల్లీ వెళ్లిన జగన్... మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తప్పించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడే పరిస్థితి లేదని మోదీకి చెప్పారు. రాష్ట్ర విభజన కారణంగా ఆదాయం దండిగా వస్తున్న హైదరాబాద్ ను కోల్పోయిన నేపథ్యంలో ఏపీ ఏ తరహా ఇబ్బందులు పడుతుందన్న విషయాన్ని గణాంకాలతో సహా వివరించే యత్నం చేశారు. ఆ తర్వాత సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ భేటీకి ఏపీ సీఎం హోదాలో హాజరైన జగన్... అక్కడ కూడా తన గళాన్ని వినిపించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై తాజా గణాంకాలతో కూడిన ఓ సవివర నివేదికను మోదీతో పాటు ఈ భేటీకి హాజరైన ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా అందజేశారు.

అంతేకాకుండా ఆ సమావేశంలో తనదైన శైలి వాదన వినిపించిన జగన్.. కేంద్ర కేబినెట్ తీర్మానం చేసిన ప్రత్యేక హోదాను ఏపీకి ిఇవ్వడంలో ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాటను నెరవేర్చడంలో ఇబ్బంది ఏమిటని, పార్లమెంటులో ఇచ్చిన హామీనే అమలు చేయకుంటే... ఇక చట్టసభలకు గౌరవమేమిటని కూడా జగన్ ప్రశ్నించారు. అయితే ఇవన్నీ కూడా చెవిటోడి ముందు శంఖం ఊదిన మాదిరే... జగన్ వాదనను మోదీ ఏమాత్రం పట్టించుకోలేదని తన తాజా చర్య ద్వారా చెప్పేశారు. ఏపీతో పాటు దేశంలోని ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని గతంలో తాము చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నామని, ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మోదీ సర్కారు పార్లమెంటు సాక్షిగానే మరోమారు చెప్పేసింది. దీంతో జగన్ కు మోదీ బిగ్ షాకే ఇచ్చారని చెప్పాలి.