నిప్పు పక్కన కూర్చున్నా.. జగన్ కు సెగ కూడా తగల్లేదే?

Sun Nov 28 2021 11:49:12 GMT+0530 (IST)

No Problem For Jagan After Attending Marriage

నిప్పు పక్కనే కూర్చోవటానికి మించిన ప్రమాదం మరొకటి ఉండదు. ఇంతకూ ఆ నిప్పు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ అయితే.. ముప్పు తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే.. ఇలాంటి ముప్పులేవీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేవన్న వైనం తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. ఇవాల్టికి సరిగ్గా ఎనిమిది రోజుల క్రితం.. గత ఆదివారం శంషాబాద్ దగ్గర్లోని ఫంక్షన్ హాళ్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మనమరాలి పెళ్లి వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి హాజరు కావటం తెలిసిందే.ఇదే పెళ్లికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావటం.. వారిద్దరు మాట్లాడుకోవటం అందరిని విపరీతంగా ఆకర్షించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే ఒక భారీ ముప్పు నుంచి జగన్ త్రుటిలో తప్పించుకున్నారనే చెప్పాలి. పెళ్లి వేడుకకు హాజరైన సీఎం జగన్ పక్కనే స్పీకర్ పోచంపల్లి కూర్చున్నారు. మాట్లాడారు. చాలాసేపు ఆయన పక్కనే ఉన్నారు. అంతేకాదు.. ఇద్దరు ముఖ్యమంత్రులకు ప్రత్యేకంగా లంచ్ ఏర్పాటు చేశారు కూడా.

కరోనా విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కచ్ఛితమైన నిబంధనలు పాటిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కేసీఆర్ మాత్రం కరోనా బారిన పడితే.. ఏపీ సీఎంకు మాత్రం అలాంటి సమస్య ఎదురు కాలేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరూ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ఈ పెళ్లి వేడుక ముగిసిన నాలుగు రోజులకు పోచంపల్లికి కరోనా పాజిటివ్ గా తేలటం.. హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరటం తెలిసిందే.

దీంతో.. ఆయనకు సన్నిహితంగా ఉన్న వారిలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. కరోనా టెస్టు రిపోర్టు పాజిటివ్ గా ఉన్నప్పటికి పోచంపల్లికి స్వల్ప లక్షణాలు ఉన్నట్లు చెబుతున్నారు. అయినప్పటికీ.. అంత దగ్గరగా మాస్కు లేకుండా కూర్చున్నప్పటికీ సీఎం జగన్ కు ఎలాంటి సమస్యా ఎదురు కాని నేపథ్యంలో.. ఆయనలోని ఇమ్యునిటీ ఎంత ఎక్కువన్న విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.