టెకీ కేసీఆర్ కు ఈమెయిల్ ఐడీయే లేదట!

Thu Nov 15 2018 22:32:12 GMT+0530 (IST)

No Mail ID, Neither FB Nor Twitter For KCR

టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సాంకేతిక నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో తనదైన శైలిలో మాటల తూటాలతో ఆకట్టుకున్న కేసీఆర్...రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తనకు టెక్నాలజీపై ఎంతటి పట్టు ఉందో చాటి చెప్పిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ అంశాల గురించి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విధానంతో కేసీఆర్ కు టెక్నాలజీపై ఎంత పట్టుందో తేటతెల్లం అయింది. ఈనికి తోడుగా ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారనే సంగతి పలు సందర్బాల్లో రుజువు అయింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన పలు సందర్భాల్లో ఉటంకించడమే ఇందుకు నిదర్శనం. అయితే ఇలా తన విభిన్నతను చాటుకున్న గులాబీ దళపతికి ఈమెయిల్ ఐడీ లేదట. ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. తన ఎన్నికల అఫిడిట్లో ఈ విషయాన్ని పొందుపర్చారు.ముందస్తు ఎన్నికల్లో భాగంగా తన ప్రస్తుత నియోజకవర్గమైన గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ ముందుకు కుదుర్చుకున్న ముహూర్తం ప్రకారం 2.34 గంటలకు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి - గజ్వేల్ ఆర్డీవోకి ఆయన పత్రాలు సమర్పించారు. వాటిలో ఆస్తులు - అప్పులు - ఇతర వివరాల చిట్టా ఇలా ఉంది.

కేసీఆర్ మొత్తం ఆస్తులు రూ.226077946గా ఉన్నాయి. వీటిలో చరాస్తుల విలువ రూ.104077946 కాగా స్థిరాస్తులు రూ.122000000. కేసీఆర్ భార్య శోభ పేరు మీద మొత్తం రూ.9459779 ఆస్తులు ఉన్నాయి. వీటిలో బంగారం - వజ్రాలు - ముత్యాలు - ఇతర విలువైన రాళ్లే అధికంగా ఉన్నాయి. శోభ దగ్గర 2.2కేజీల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వాటి విలువ రూ.9366184. కేసీఆర్ - ఆయన భార్య శోభల స్థిరచరాస్తుల వివరాల మొత్తం ఇలా ఉంది.

కేసీఆర్ స్థిరాస్తులు రూ.122000000 (వ్యవసాయ - వ్యవసాయేతర భూములు - ఇళ్లు - ఫామ్ హౌస్ అన్నీ కలుపుకొని)

కేసీఆర్ చరాస్తులు రూ.104077946
కేసీఆర్ దగ్గర ఉన్న నగదు రూ.240000
ఫిక్స్ డ్ డిపాజిట్లు - ఇతర డిపాజిట్లు రూ.56373946
తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ లో షేర్ల విలువ రూ.5500000
తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో షేర్ల విలువ రూ.41625000
కేసీఆర్ వద్ద ఉన్న బంగారం 75 గ్రాములు - విలువ రూ.240000
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏడాదికి రూ.99000 ఇన్సూరెన్స్
కేసీఆర్ భార్య శోభ మొత్తం ఆస్తులు రూ.9459779
2.2కిలోల బంగారు ఆభరణాల విలువ రూ.9366184
నగదు రూ.93595

శోభ పేరిట ఎలాంటి ఫిక్స్ డ్ డిపాజిట్లు - స్థిరాస్తులు లేవు. ఆమెకు ఎలాంటి అప్పులు కూడా లేవని అఫిడవిట్ లో పేర్కొన్నారు.

కేసీఆర్ మొత్తం అప్పులు రూ.88847570
బి.శ్రీనివాసరావుకి బాకీ రూ.30000000
ప్యాక్ట్ సెక్యూరిటీస్ & ఫైనాన్షియల్స్ సర్వీసెస్ లిమిటెడ్ అప్పు రూ.37500000
జి. వివేకానంద్ రుణం రూ.10600000
కొడుకు కేటీఆర్ కు బాకీ మొత్తం రూ.8282570
కోడలు శైలిమకు బకాయి రూ.2465000
2017-18 ఆర్థిక సంవత్సరానికి దాఖలు చేసిన ఆదాయపన్ను రిటర్న్స్ లో వ్యక్తిగత ఆదాయం రూ.11025210 హిందూ అవి భక్త కుటుంబ ఆదాయం రూ.540300గా చూపారు. ఏడాది నికర వ్యవసాయ ఆదాయం కేవలం రూ.9152657గా పేర్కొన్నారు.

కేసీఆర్ పై మొత్తం 64 కేసులు ఉన్నట్టు అఫిడవిట్‌లో తెలిపారు. వీటిలో తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్టిన కేసులే ఎక్కువగా ఉన్నాయి.కాగా తనకు ఈ మెయిల్ ఐడీvpreddy0003@gmail.com అని కేసీఆర్ వివరించారు. కాగా తనకు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్ లేదని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇటు పార్టీ పరంగా అటు ప్రభుత్వం పరంగా నిర్వహిస్తున్న ఆయన ఖాతాలు సంబంధిత వ్యక్తులు సమన్వయం చేస్తున్నవి అయి ఉండవచ్చని భావిస్తున్నారు.

TAGS: