ఇంతకీ జనసేన ఎన్ని సీట్లకు పోటీ చేసింది?

Fri Apr 19 2019 20:00:02 GMT+0530 (IST)

No Clarity on About Janasena Contesting Constituencies in Andhra

ఏపీ ఎన్నికల సంగ్రామంలో తృతీయ పక్షంగా బరిలోకి దిగిన జనసేన ఎన్ని సీట్లకు పోటీ చేసిందనేది అంత తేలికగా సమాధానం దొరికే ప్రశ్నగా కనిపించడం లేదు. కమ్యూనిస్టు పార్టీలు - బీఎస్పీతో కలిసి పోటీకి దిగిన జనసేన ఆఖరి నిమిషంలో వివధ మార్పులను చేసింది. మిత్రపక్షాలకు కేటాయించిన పలు సీట్లలో జనసేన తరఫున నామినేషన్లు దాఖలు అయ్యాయి.దీంతో అక్కడ లెక్కంతా మారిపోయింది. మరి కొన్ని చోట్ల జనసేన అవకాశం ఉన్నా జనసేన అభ్యర్థులు నిలబడలేదని తీరా పోలింగ్ రోజున తెలిసింది. కొన్ని ఎంపీ సీట్లకే జనసేన తరఫున అభ్యర్థులు లేకపోవడం ఆశ్చర్యపరిచింది. ఆ నియోజకవర్గాల్లో జనసేన మిత్రపక్ష పార్టీలు ఏవైనా పోటీ చేశాయా? అంటే .. అది కూడా లేదు!

దీంతో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేసిందనే అంశం అంత తేలికగా అర్థమయ్యేలా లేదు. బీఎస్పీకి జనసేన భారీగానే సీట్లను కేటాయించింది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు చాలా వరకూ ఆ పార్టీకే కేటాయించింది పవన్ కల్యాణ్ పార్టీ. కమ్యూనిస్టు పార్టీలకు పాతిక సీట్ల వరకూ అన్నారు కానీ.. ఆ సీట్ల డీలింగ్ లో తర్వాత పలు మార్పులు జరిగాయి. ఇక ఒకటీ రెండు చోట్ల జనసేన పార్టీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైన దాఖలాలు కూడా ఉన్నాయి.

కొన్ని ఎంపీ సీట్లలో జనసేన తరఫు నుంచి కానీ ఆ పార్టీ మిత్రపక్షాల తరఫు నుంచి కానీ నామినేషన్లు ఏవీ దాఖలు కాలేదు! ఇలా జనసేన పోటీ చేసి స్థానాల విషయంలో ఒకింత సందేహాలు నెలకొని ఉన్నాయి.

మరోవైపు తమ పార్టీ ఎనభై ఎనిమిది స్థానాలు నెగ్గి అధికారాన్ని సాధించుకుంటుందని జనసేన నేత లక్ష్మినారాయణ స్టేట్ మెంట్ ఇవ్వడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

జనసేన పోటీ చేసిందే అరవై ఐదు సీట్లకు అని.. అలాంటి పార్టీకి ఎనభై ఎనిమిది సీట్లు ఎలా వస్తాయని ఆయన  ప్రశ్నించారు! లక్ష్మినారాయణ తీరుపై ధ్వజమెత్తారు!