Begin typing your search above and press return to search.

'పీతల' తేలిపోతుందా.? టిక్కెట్ కష్టమేనట..

By:  Tupaki Desk   |   2 Sep 2018 11:19 AM GMT
పీతల తేలిపోతుందా.? టిక్కెట్ కష్టమేనట..
X
పార్టీ పవర్ లో ఉంది.. పేరుకు ముందు మాజీ మంత్రి ఉంది..సిట్టింగ్ ఎమ్మెల్యే హోదా కూడా ఉంది. అయినా పవర్ పాలిట్రిక్స్ ప్లే చేయడంలో ఆమె వెనుకంజలో ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో దూసుకొచ్చిన నాయకురాలిగా పీతల సూజత పేరు వినపడుతోంది. ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తూ టీడీపీకి జైకొట్టారు సుజాత..గతంలో ఆచంట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎలాంటి పదవి రాకున్నా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. దీంతో ఆమె సొంత నియోజకవర్గం కాకుండా చింతలపూడి నుంచి చంద్రబాబు అవకాశం ఇచ్చారు. గెలిచిన తర్వాత ఏకంగా మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇలా ఏపీ రాజకీయాల్లో కొద్దికాలంలోనే పీతల సూజత కెరీర్ గ్రాఫ్ బాగా ఎదిగింది. కానీ ఇప్పుడు అంతే వేగంగా ఆమె చేసిన పనులతో తన పట్టును కోల్పోతూ వచ్చారట..

ప్రభుత్వ విప్ చింతమనేని.. ఏలూరు ఎంపీ మాగంటి బాబులతో ఆమెకు పొసగకపోవడం.. స్థానికంగా విమర్శలు ఎక్కువ కావడంతో మంత్రివర్గం నుంచి ఆమెను తొలగించారు చంద్రబాబు నాయుడు. నాటి నుంచి నియోజకవర్గం చింతలపూడిలో పట్టు నిలుపుకోవడానికి సుజాత చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదట.. వచ్చే ఎన్నికల్లో సుజాతకు అసలు టిక్కెట్ వస్తుందా.. ఆమె ఎక్కడి నుంచి పోటీచేస్తుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.

సుజాత.. పార్టీకి విధేయురాలిగా ఉన్నా సొంత వర్గం.. సొంత నియోజకవర్గం లేకపోవడమే ఆమెకు మైనస్ గా మారింది. ఈమెపై విమర్శలను బేస్ చేసుకోని ఆమెకు వ్యతిరేకంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జయరాజ్ అయితే ఈసారి తనకే టిక్కెట్ అని నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారట.. అలాగే తాడేపల్లి గూడెం ఆర్టీవోగా ఉన్న విజయరాజు కూడా వచ్చే ఎన్నికల్లో చింతలపూడి నుంచి పోటీకి రెడీ అవుతున్నారట.. ఈయనకు చింతలపూడిలో గట్టి పరిచయాలున్నాయట..

కాగా ఈ ముగ్గురూ చింతలపూడికి స్థానికేతరులే.. వలసవచ్చిన వారే.. స్వతహాగా చింతలపూడి నుంచి కూడా వచ్చే ఎన్నికల్లో నాయకులు తయారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే ఈ ముగ్గురికి గట్టి పోటీ ఎదురవడం ఖాయం..

సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో అందరికంటే ముందుండాల్సిన ఎమ్మెల్యే సుజాత ఇప్పుడు నియోజకవర్గంలో వెనుకబడిపోయారట.. కేవలం ఒంటరిగా ఉంటూ తన పని తాను చేసుకుపోయే సుజాతకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కుతుందా ఈ వార్ లో విజయం ఆమెదా.. ఆమె ప్రత్యర్థులదా అన్నది టీడీపీలో హాట్ టాపిక్ గా మారిందట..