హుజూరాబాద్ ఉప ఎన్నికలో నిజామాబాద్ సీన్ రిపీట్?

Thu Jul 22 2021 11:13:21 GMT+0530 (IST)

Nizamabad scene repeat in Huzurabad by-election?

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  నిజామాబాద్ లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికలు దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షించాయి. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఎన్నికల బరిలో నిలవటం ఒకటైతే.. ఆమెకు షాకిచ్చేందుకు వీలుగా తమ దీర్ఘకాలిక డిమాండ్ అయిన పసుపు బోర్డును ఏర్పాటుపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా.. 175 మంది రైతులు ఎన్నికల బరిలో నిలవటం తెలిసిందే. రైతులు సమిష్ఠిగా తీసుకున్న నిర్ణయం కవిత ఓటమికి కారణమైందన్నది మర్చిపోకూడదు.తెలంగాణలో తిరుగులేని అధికారం ఉందని చెప్పకునే కేసీఆర్.. తన కూతుర్ని గెలిపించుకోలేకపోయారన్న విమర్శ పెద్ద ఎత్తున వచ్చింది. కవిత ఓటమి తెలంగాణ అధికారపక్షాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేయటమే కాదు.. వారంతా ఆత్మరక్షణలో పడేసేలా చేసింది. తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో అనివార్యంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి సంచలన ప్రకటన ఒకటి తెర మీదకు వచ్చింది. బీసీ వర్గాల హక్కుల కోసం కోట్లాడే ఆర్ క్రిష్ణయ్య తాజాగా చేసిన ఒక ప్రకటన తెలంగాణ అధికార పక్షం ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది.

ఎందుకంటే.. బీసీలకు చెందిన వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లు హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో దిగుతారంటూ సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వం అన్యాయంగా తొలగించిన 7600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు మళ్లీఉద్యోగాల్ని ఇవ్వని పక్షంలో తాము సైతం ఎన్నికల బరిలో నిలుస్తారని చెబుతున్నారు. అంతేకాదు.. వందలాదిగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం అక్రమంగా తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లును వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆయన అల్టిమేటం ఇచ్చారు.

హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో వెలువడే ఫలితం 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొన్నారు. ఊహించని రీతిలో తెర మీదకు వచ్చిన ఈ డిమాండ్ పై కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరమని చెప్పక తప్పదు. అయితే.. ఆర్ క్రిష్ణయ్య పేర్కొన్నట్లుగా వెయ్యి మంది బరిలోకి దిగే అవకాశం ఉందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. నిజానికి పసుపు రైతులు సైతం వెయ్యి మంది ఎన్నికల బరిలో నిలవాలని ప్లానింగ్ చేసినప్పటికి.. ప్రాక్టికల్ ఇష్యూస్ తో 175 మందే ఎన్నికల బరిలో దిగారు. మరి.. హూజూరాబాద్ లో నిజామాబాద్ సీన్ రిపీట్ అవుతుందా? లేదా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.