Begin typing your search above and press return to search.

బిహార్ లోనే కాదు కేంద్ర ప్రభుత్వంలోనూ నితీశ్ ఎఫెక్టు.. అదెలానంటే?

By:  Tupaki Desk   |   10 Aug 2022 2:30 PM GMT
బిహార్ లోనే కాదు కేంద్ర ప్రభుత్వంలోనూ నితీశ్ ఎఫెక్టు.. అదెలానంటే?
X
మిగిలిన స్నేహాలు ఎలా ఉన్నా.. రాజకీయ స్నేహాలు మాత్రం ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. అన్నింటికి మించిన ఆ సమీకరణలు మిగిలిన వాటికి భిన్నంగా ఉంటాయి. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. మిత్రుల్ని మొయింటైన్ చేసే విషయంలో మోడీషాల ట్రాక్ రికార్డు ఏ మాత్రం బాగోలేదనే చెప్పాలి. మిత్రుల్రి ఒక దశ వరకు వెంట ఉంచుకునే మోడీషాలు.. తర్వాతి కాలంలో తామేమిటో చూపిస్తారని చెబుతారు. దీంతో.. వారి తీరుకు విసిగిపోయి.. మనకెందుకులే ఈ గొడవ అంటూ కటీఫ్ చెప్పుకోవటం కనిపిస్తూ ఉంటుంది.

బీజేపీతో మొదట్నించి భాగస్వామ్య పక్షంగా వ్యవహరించే శివసేన.. శిరోమణి అకాలీదళ్ రెండు పరా్టీలు కూడా మోడీషాల దెబ్బకు మిత్రపక్ష హోదా నుంచి తప్పుకున్న వైనం తెలిసిందే. తాజాగా నితీశ్ కుమార్ తప్పుకోవటం తెలిసిందే. బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన.. తన ప్రభుత్వానికి చెల్లు చీటి ఇచ్చేసి.. మద్దతుగా నిలిచిన బీజేపీకి గుడ్ బై చెప్పేసి.. కొత్త మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

నితీశ్ కారణంగా బిహార్ లో అధికారపక్షంలో భాగస్వామి అయిన బీజేపీ.. ఇప్పుడు విపక్షంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. నితీశ్ కారణంగా రాజ్యసభలోనూ బీజేపీకి బలం తగ్గటమేకాదు.. దాని ప్రభావం మోడీషాల మీద నేరుగా పడినట్లుగా చెబుతున్నారు.

అదేమంటే.. ఇప్పటికే రాజ్యసభలో అవసరమైన బలం లేని మోడీ సర్కారుకు ఇప్పుడు మరింత బలం తగ్గినట్లైంది. అదెలానంటే.. రాజ్యసభలో మొత్తం సంఖ్యాబలం 245 అయితే.. జమ్ముకశ్మీర్ నుంచి నాలుగు.. త్రిపుర నుంచి ఒకటి.. మూడునామినేటెడ్ ఖాళీలు ఉన్నాయి.

దీంతో.. రాజ్యసభలో ఉన్న 237 మందికి మెజార్టీ మార్కు 119. ఇప్పటివరకు ఎన్డీయే బలం మాత్రం 115 అది కూడా నితీశ్ పార్టీకి చెందిన ఐదుగురు ఉండటంతో. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ బలం 110కు తగ్గింది. అంటే.. మెజార్టీకి అవసరమైన 9 సీట్లకు తక్కువగా ఉంది.

రాబోయే కొద్ది రోజుల్లోనామినేటెడ్ పదవుల్లోకి మోడీ సర్కారు తరఫున మగ్గురు సభ్యుల్నినామినేట్ చేస్తారు. త్రిపురలోని ఒక సీటు బీజేపీకే రానుంది. ఆ లెక్కన చూసుకున్నా మెజార్టీ మార్కులోకి బీజేపీ రాలేని పరిస్థితి. అయితే.. కేంద్రానికి దన్నుగా నిలిచే రాజ్యసభలో మెజార్టీ రాని పరిస్థితి. కాకుంటే.. బయట నుంచి మద్దతు ఇచ్చే వైసీపీ లాంటి పార్టీలతో కాస్తంత ఊరట లభించినా.. సొంతబలం మాత్రం లేదన్నది వాస్తవం. ఇదంతా చూసినప్పుడు నితీశ్ బిహార్ లోనే కాదు.. మోడీ సర్కారుకు తన ఎఫెక్టు చూపించారన్న మాట వినిపిస్తోంది.