Begin typing your search above and press return to search.

కరోనా వేళ ఎన్నికలు.. బీహార్ లో నితీశ్ గట్టెక్కేనా?

By:  Tupaki Desk   |   12 Aug 2020 11:30 PM GMT
కరోనా వేళ ఎన్నికలు.. బీహార్ లో నితీశ్ గట్టెక్కేనా?
X
కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ.. పోలింగ్ నిర్వహణ అంటే మాటలు కాదు కదా. అయితే బీహార్ అసెంబ్లీకి నిర్ణీత గడువులోగానే ఎన్నికలను నిర్వహిస్తామని కేంద్రం ఎన్నికల సంఘం ప్రదాన కమిషనర్ సునీల్ అరోరా చేసిన ప్రకటన నిజంగానే సంచలనంగా మారిపోయింది. సెప్టెంబర్- అక్టోబర్ మధ్యలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా విలయం నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ అంతగా సాహసించదన్న భావనతో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఒకింత దిలాసాగా ఉన్నారు. అయితే బుధవారం ఈసీ నుంచి వచ్చిన ప్రకటన ఆయనకు ముచ్చెమటలు పట్టించేసిందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.

ఇప్పటికే వరుసగా మూడోసారి సీఎం కుర్చీ ఎక్కిన నితీశ్... ఇప్పుడు నాలుగో పర్యాయం కూడా అధికారం చేజిక్కించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. అయితే ఉన్నట్టుండి కరోనా ఉరుము లేని పిడుగులా వచ్చి పడటంతో బీహార్ పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. దేశంలోనే అత్యంత తక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఇప్పటికే అపఖ్యాతి మూటగట్టుకున్న బీహార్.. కరోనా కట్టడిలో ఘోరంగా విఫలమైపోయింది. ఇక కరోనా నేపథ్యంలో దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలకు వెళ్లిన బీహారీ వలస కూలీలు తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంది. అదే సమయంలో తాజాగా ఆ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదలతో జనం అల్లాడిపోతున్నారు. విపత్తుల నిర్వహణలో ఏమాత్రం జాగ్రత్త లేకుండా వ్యహరిస్తున్నారంటూ నితీశ్ పై అప్పుడే విపక్షాలు ఒంటికాలిపై లేచి కూర్చున్నాయి. ఇలాంటి సమయంలో అసెంబ్లీ ఎన్నికలను నిర్ణీత గడువులోగానే నిర్వహిస్తామంటూ ఈసీ ప్రకటన చేయడం నితీశ్ పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కరోనా కట్టడిలో విఫలం, ఉద్యోగ కల్పనలో మరింత విఫలం, వరదల సందర్భంగా జనానికి అండగా నిలవడంలో ఘోరంగా విఫలం... ఇలా అన్నింటా విఫల నేతగా కనిపిస్తున్న నితీశ్ కు ఈ దఫా ఎన్నికలు కత్తి మీద సాము లాంటివేనని చెప్పాలి. గతంలో నితీశ్ గట్టెక్కేలా చేయడంలో ఆర్జేడీది కీలక భూమిక. అయితే ఇప్పుడు నితీశ్ ను ప్రతి అంశంలో తనదైన శైలిలో తూలనాడుతున్న ఆర్జేడీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అన్నట్లుగా ఎదురు చూస్తోంది. నితీశ్ వైఫల్యాలనే తమ విజయ సోపానాలుగా చేసుకోవాలని ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ చూస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితిలో నితీశ్ ఎలా గట్టెక్కుతారన్నది ప్రశ్నార్థకంగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.