కాళేశ్వరంపై కేసీఆర్ పప్పులు ఉడకలేదు

Fri Aug 10 2018 11:01:37 GMT+0530 (IST)

కేంద్రం దగ్గర కేసీఆర్ పప్పులు ఉడకలేదు. తన అవసరాలు తీర్చుకునేందుకు చక్కగా దువ్వటం.. ఆ తర్వాత మీదేముంది గొప్ప.. మేం ఒత్తిడి చేశాం కాబట్టి ఇచ్చారు కానీ.. లేకుంటే ఇచ్చే వారా?  మీరు.. మీ ఢిల్లీ తెలివితేటలు నా దగ్గరా?  అంటూ పంచ్ ల మీద పంచ్ లు వేయటం కేసీఆర్ కు మామూలే.కేసీఆర్ తరహా నేతల్ని మోడీ ఎంతమందిని చూసి ఉంటారు?  ఇలాంటి తెలివితేటలు తన దగ్గర చెల్లవన్న విషయాన్ని తాజాగా తన తీరుతో స్పష్టం చేసింది కేంద్రం. అడిగినంతనే అపాయింట్ మెంట్ ఇచ్చేస్తే మాత్రం.. కోరుకున్నదల్లా ఇచ్చేయటం సాధ్యం కాదన్న విషయాన్ని తన మాటలతో తేల్చేశారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.

ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన జాతీయ హోదా మాదిరి.. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటూ డిమాండ్ ను తెర మీదకు తెచ్చారు కేసీఆర్.

ఇలా ఇచ్చుకుంటూ పోతే ప్రతి రాష్ట్రం ఏదో ఒక ప్రాజెక్టును తెర మీదకు తెస్తుందన్న విషయాన్ని గుర్తించిన కేంద్రం.. కేసీఆర్ తో ఉన్న దోస్తానా విషయాన్ని పక్కన పెట్టి మరీ.. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుండబద్ధలు కొట్టేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పిన ఆయన.. ఏపీ విభజన చట్టం ప్రకారం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించామని.. భవిష్యత్తులో మరే ఇతర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చేది లేదని తేల్చేశారు.

తాజాగా లోక్ సభా ప్రశ్నోత్తరాల వేళ తీస్తా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమంలో గడ్కరీ తాజా వ్యాఖ్యలు చేశారు. ఎప్పటి మాదిరే తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా గడ్కరీ చెప్పిన సమాధానంపై స్పందించిన ఎంపీ వినోద్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు.

విభజన చట్టంలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారని.. అదే చట్టంలో పేర్కొన్న కాళేశ్వరం.. పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుల్లో ఒకదానికి హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెయ్యిచ్చిన కేంద్రంపై కేసీఆర్ ఏ రీతిలో రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.