బాబోయ్...ప్రాజెక్టులా...!!

Fri Aug 10 2018 20:00:26 GMT+0530 (IST)

రానున్న రోజులలో ఇక ప్రాజెక్టులపై ఆశ వదులుకోవల్సిందేనా...? రాబోయే రోజులలో ఇక ఏ  ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వబోమని కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేసారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కోరుతూ తెలంగాణ రాష్ట్రం చేసిన విజ్ణప్తికి సమాధానంగా నితిన్ ఈ ప్రకటన చేసారు.విభజన బిల్లులో పోలవరానికి జాతీయ హోదా కల్పించినందువల్లే ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చామని నితిన్ అన్నారు. ఇకపై సాగునీటి బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే అని నితిన్ గడ్కరీ స్పష్టం చేసారు. రాష్ట్రాలు ఏమైనా ప్రాజెక్టులు చేపట్టాలనుకుంటే అదీ కూడా కరువు పీడిత ప్రాంతాలుగా గుర్తిస్తే కేంద్రం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 60 శాతం భరిస్తుందని మిగతా 40 శాతం రాష్ట్రాలే భరించాలని నితిన్ గడ్కరీ స్పష్టం చేసారు.

భారతీయ జనతా పార్టీ గెలుపొందితే తమకు ఎంతో మేలు చేస్తారనుకున్న ప్రజలకు ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలతోను - చేస్తున్న ప్రకటనలతోను ఉక్కిరిబిక్కరవుతున్నారు. దేశంలో ఒక ప్రాజెక్టు కట్టాలంటే కొన్ని వేలకోట్లు ఖర్చువుతుంది. ఇప్పుడే పురుడు పోసుకుంటున్న చిన్న రాష్ట్రాలు నిలబడాలంటే ఇలాంటి ప్రాజెక్టులు ఎంతోఅవసరం కానీ చిన్న రాష్ట్రాల దగ్గర 40 శాతం నిధులు  ఉంటాయా. ఇంత చిన్న విషయం కూడా కేంద్రంలో ఉన్న నాయకులకు - అధికారులకు తెలీయదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఓట్లకోసం - నాయకత్వం కోసం ఇష్టానుసారంగారాష్ట్రాలను విభజించి ఇప్పుడు నిధులు విషయానికి వచ్చేసరికి చేతులెత్తుస్తున్న బీజేపీపై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు.

జార్ఖండ్ - ఛతీస్ గడ్ లాంటి అతి చిన్న రాష్ట్రలు భవిష్యత్తులో 40 శాతం ప్రాజెక్టుకు ఖర్చుపెట్టే స్దాయిలో ఉన్నాయా....." భారత్ వెలిగిపోతోంది " అంటూ నినదించినా మోదీ సర్కార్ తమ వంతూ  సాయం లేకుండా భారత్ ఎలా వెలుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలే వర్షాలు లేక అన్నదాత నడిరోడ్డు మీదకి వస్తున్నాడు ఇక ప్రాజేక్టులకు తాము చేయూతనివ్వం అనడం ఎంత వరకూ సమంజసం. ఎన్నో వేల ఎకరాలకు సాగునీరందించే ప్రాజేక్టులకు జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పడం వల్ల భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టులు కట్టాడానికి ముందుకొస్తాయా... ఇలాంటి నిర్ణయాల వలన ఆహర పదార్దాలను ఎగుమతి చేసుకునే పరిస్థితి నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు తస్మాత్...జాగ్రత్త...