Begin typing your search above and press return to search.

ఆర్టీసీ సమ్మెపై సారుతో గడ్కరీ మాట్లాడతారట!

By:  Tupaki Desk   |   21 Nov 2019 11:18 AM GMT
ఆర్టీసీ సమ్మెపై సారుతో గడ్కరీ మాట్లాడతారట!
X
ఎవరేం చెప్పినా.. తానేం అనుకున్నానో అది మాత్రమే చేయాలన్నట్లుగా వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో తన తీరు ఎలా ఉంటుందో చేతల్లో చేసి చూపించారు. దాదాపు ఏడు వారాలకు దగ్గరగా సమ్మె చేసినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గని ప్రభుత్వాధినేతగా కేసీఆర్ నిలిచారు. కార్మికుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని వివిధ పార్టీల నేతలతో పాటు.. కోర్టు సైతం చేసిన వ్యాఖ్యలకు స్పందించని సీఎం కేసీఆర్ తాజాగా కొత్త ఇబ్బందిని ఎదుర్కోనున్నారా? అంటే అవునంటున్నారు.

మిగిలిన కేంద్రమంత్రులకు.. నితిన్ గడ్కరీకి మధ్య వ్యత్యాసం ఉంది. స్నేహపూర్వకంగా ఉండటంతో పాటు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో పాటు.. సీఎం కేసీఆర్ తో చక్కటి అనుబంధం ఉన్న గడ్కరీ.. నేరుగా సమ్మె సీన్లోకి వస్తానని వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది.

అంతేకాదు.. తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడతానని.. రాష్ట్ర రవాణా మంత్రి.. అధికారుల్ని ఢిల్లీకి పిలిపించి సమావేశం నిర్వహిస్తానని గడ్కరీ ప్రకటించటం గమనార్హం. ఒకవైపు సమ్మె కాడిని పడేసేందుకు ఆర్టీసీ కార్మికుల జేఏసీ సిద్ధంగా ఉన్న వేళ.. సమ్మె అంశంపై ఈ రోజు (గురువారం) సాయంత్రం రివ్యూ నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

ఇలాంటివేళలో అనూహ్యంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెర మీదకు వచ్చి.. తాను సమ్మె అంశంపై సీఎం కేసీఆర్ తో మాట్లాడతానని చెప్పటం కీలక పరిణామంగా భావిస్తున్నారు. సమ్మె వ్యవహారంలో ఎవరి జోక్యం ఉండకూడదని.. ఒకవేళ జోక్యం చేసుకున్నా.. వారికి తగ్గట్లు తాను రియాక్ట్ కాకూడదన్నట్లుగా సీఎం ఉన్నారన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. తమకు సన్నిహితుడైన గడ్కరీ నేరుగా సీన్లోకి వచ్చేస్తానని చెప్పటంతో గులాబీ బాస్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

కేంద్రసహాయమంత్రి కిషన్ రెడ్డితో పాటు.. తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్.. అరవింద్.. సోయం బాపూరావులు గడ్కరీని కలిసి సమ్మె ఇష్యూలో కలుగజేసుకోవాలని కోరటంతో ఆయన రియాక్ట్ అయ్యారు. మరి.. గడ్కరీ తాను అనుకున్నది ఎంతమేర చేస్తారో చూడాలి. ఎందుకంటే.. ఆయన డీల్ చేయాలనుకుంటున్నది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో అన్న విషయాన్ని మర్చిపోకూడదు.