Begin typing your search above and press return to search.

నిత్యానంద వారి కైలాస దేశం..

By:  Tupaki Desk   |   4 Dec 2019 4:52 AM GMT
నిత్యానంద వారి కైలాస దేశం..
X
దేశంలో స్వామీజీలు ఎంతోమంది ఉన్నా.. కొందరు మాత్రం వివాదాలకు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు. అలాంటి వారిలో నిత్యానంద ఒకరు. అత్యాచార కేసులో నిందితుడిగా.. ఇటీవల కాలంలో పరారీలో ఉన్నట్లుగా చెబుతున్న ఆయన మరో సంచలనానికి తెర తీశారు.

తన కోసం.. తన వారి కోసం.. తనను నమ్మే వారి కోసం కైలాస పేరుతో సొంతంగా ఒక ద్వీప దేశాన్ని క్రియేట్ చేసుకున్న వైనం కలకలంగా మారింది. అంతేనా.. తన ద్వీప దేశాన్ని గుర్తించాల్సిందిగా ఐక్య రాజ్య సమితి గుర్తింపు కోసం తన ప్రతినిధుల్ని రంగంలోకి దింపిన వైనం చూస్తే.. అయ్యారే అని అవాక్కు అవ్వాల్సిందే.

తన దేశానికి కైలాసగా పెట్టుకున్న ఆయన.. ఆ ద్వీప దేశానికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఒక వెబ్ సైట్ ను ఏర్పాటు చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. కైలాస.. రివైవింగ్ ద ఎన్ లైటెన్డ్ సివిలైజేషన్ .. ద గ్రేట్ హిందూ నేషన్ పేరుతో ఏర్పాటు చేశారు నిత్యానంద.

సొంత దేశం ఏర్పాటు చేయటమే కాదు.. సొంత జెండా.. పాస్ పోర్టు.. జాతీయ చిహ్నం.. రాజ్యాంగం.. ఇలా అన్ని ఏర్పాటు చేసుకున్న ఆయన.. తన దేశానికి తానే రాజుగా ప్రకటించుకున్నారు. పాలన కోసం ప్రధానమంత్రిని.. మంత్రిమండలిని నియమించుకున్నారు. కైలాస దేశానికి విరాళాలు ఇస్తే.. ఆ దేశ పౌరసత్వాన్ని పొందొచ్చన్న బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. తన దేశానికి ప్రధానిగా తన అనుచరుడైన ‘మా’ అనే వ్యక్తిని ప్రధానిగా నియమించిన నిత్యానంద కేబినెట్ ను కూడా ఏర్పాటు చేశారు. కైలాస దేశ రాజ్యాంగంలో 547 పేజీలు ఉన్నాయి. దీన్ని హిందీ.. తమిళం.. , సంస్కృత భాషల్లో రాజ్యాంగాన్ని తయారు చేశారు. తన దేశాన్ని గుర్తించాలని కోరుతూ ఐక్యరాజ్యసమితికి ఒక పిటిషన్ ను సమర్పించుకున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

హిందూయిజాన్ని ఆచరించే తనకు.. దాన్ని వ్యాపింపచేసేందుకు ప్రయత్నిస్తున్న తన ప్రాణాలకు భారతదేశంలో ముప్పు ఉందని పేర్కొన్న నిత్యానందుడు.. తన కైలాస దేశాన్ని ఈక్వెడార్ నుంచి కొనుగోలు చేసినట్లుగా పేర్కొన్నారు. కైలాస దేశ జెండా రిషభద్వజం.. దాని రంగూ మెరూన్ ఉంటే.. దాని మీద శివుడి రూపంలో చిద్విలాసంగా ఉండే నిత్యానంద బొమ్మ.. పక్కనే నంది విగ్రహం ఉండేలా డిజైన్ చేశారు. మరింత విచిత్రమైన విషయం ఏమంటే.. నిత్యానంద చెప్పుకుంటున్న కైలాస దేశంలో తాము కూడా పౌరులమని పేర్కొంటూ ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఇప్పటికే సభ్యత్వాలు నమోదు చేసుకోవటం గమనార్హం. మరి.. దీనిపై ఐక్యరాజ్యసమితి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.