Begin typing your search above and press return to search.

ఆ ‘ఇద్దరిపై’ పెరిగిపోతున్న తీవ్ర ఉత్కంఠ

By:  Tupaki Desk   |   23 Jan 2021 8:53 AM GMT
ఆ ‘ఇద్దరిపై’ పెరిగిపోతున్న తీవ్ర ఉత్కంఠ
X
ఇపుడు రాష్ట్రం మొత్తం ఆ ఇద్దరు అధికారుల గురించే ఆలోచిస్తోంది. ఆ ఇద్దరి భవిష్యత్తు ఏమిటనే విషయంపైనే తీవ్ర ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇంతకీ ఆ ఇద్దరు ఏవరో తెలుసా ? గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లే. ఎన్నికల ప్రక్రియలో ఉల్లంఘనలను అడ్డుకోలేకపోయారని, హింసను నియంత్రించలేకపోయారనే కారణంతో పోయిన సంవత్సరం మార్చిలోనే వాళ్ళని ఎన్నికల విధుల నుండి తప్పించాలని స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ ఆదేశాలు జారీచేశారు.

అయితే అప్పట్లోనే ఎన్నికలు ఆగిపోవటంతో ప్రభుత్వం వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి నుండి ఏ సందర్భం వచ్చినా నిమ్మగడ్డ వాళ్ళిద్దరిపై వేటున ప్రస్తావిస్తునే ఉన్నారు. ప్రభుత్వం నిమ్మగడ్డ ఆదేశాలను పట్టించుకోలేదు. ఇపుడు పంచాయితీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ముందుగా నిమ్మగడ్డ వాళ్ళిద్దరిపైనే వేటు వేసేశారు. తన ఆదేశాలను ప్రభుత్వం పాటించాల్సిందేనంటూ చీఫ్ సెక్రటరీకి లేఖ కూడా రాశారు. అయితే వాళ్ళని కలెక్టర్ విధుల్లో నుండి తప్పించటం సాధ్యంకాదని ప్రభుత్వం నిమ్మగడ్డకు చెప్పేసింది.

ఇద్దరు కలెక్టర్లపై ఎన్నికల బాధ్యతలను సాకుగా చూపించి వేటు వేయాల్సిందే అని పట్టుబడుతున్నారు. ప్రభుత్వం ఏమో వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇద్దరు కలెక్టర్లు చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు కాబట్టి చర్యలు తీసుకోవటం సాధ్యంకాదని స్పష్టం చేసేసింది. అంటే నిమ్మగడ్డ చెప్పినట్లుగా ఆ ఇద్దరు కలెక్టర్లపై వేటు వేయటానికి ప్రభుత్వం ఇష్టపడటం లేదని అర్ధమైపోయింది. మరి ప్రభుత్వం వాళ్ళపై వేటు వేయకపోతే నిమ్మగడ్డ ఏమి చేస్తారు ? ఇదే ఇపుడు ఉత్కంఠను పెంచేస్తోంది.

ఇద్దరు కలెక్టర్లతో పాటు తిరుపతి అర్బన్ ఎస్పీ, ప్రస్తుతం అనంతపురం అర్బన్ ఎస్పీ, రాయదుర్గం, మాచర్ల, పుంగనూరు, తాడిపత్రి ఇన్స్ స్పెక్టర్లపైన కూడా బదిలీ వేటు పడింది. సరే వీళ్ళ విషయంలో ఎవరికీ ఎటువంటి పేచీలేదు కాబట్టి బదిలీకి ఇబ్బంది లేదనే అనుకుంటున్నారు. కాకపోతే సమస్యంతా ఇద్దరు కలెక్టర్లపై వేటు విషయంలోనే తలెత్తింది. ఇక్కగ గమనించాల్సిన విషయం ఏమిటంటే తనకున్న అధికారాలతో నిమ్మగడ్డ ఎవరిపైనైనా వేటు వేయచ్చు. కానీ దాన్ని అమలు చేయాల్సింది మళ్ళీ చీఫ్ సెక్రటరీనే.

అప్పుడెప్పుడో పోయిన ఏడాది మార్చిలో తన ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదనే కక్ష నిమ్మగడ్డలో పేరుకుపోయింది. అందుకనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించిన వెంటనే దూకుడుగా తనిష్టంవచ్చిన వాళ్ళపై వేటు వేయటానికి పావులు కదిపేస్తున్నారు. అంటే నిమ్మగడ్డ కావాలనే కలెక్టర్లు, పోలీసు అధికారుల విషయంలో దూకుడుగా వెళుతున్నారని తెలుస్తోంది. మరి ఎన్నికల వాయిదాపై ప్రభుత్వం వేసిన కేసు సోమవారం విచారణకు రాబోతోంది. అప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే సరి. లేకపోతే మాత్రం ప్రభుత్వానికి నిమ్మగడ్డకు మధ్య పెద్ద యుద్ధం తప్పేట్లు లేదు.