Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ షాక్ .. ఆ తీర్మానంపై గవర్నర్ కి లేఖ !

By:  Tupaki Desk   |   5 Dec 2020 11:07 AM GMT
ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ షాక్ .. ఆ తీర్మానంపై గవర్నర్ కి లేఖ !
X
ఏపీలో ప్రభుత్వానికి , రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ కి మధ్య వివాదం కొనసాగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలని రాష్ట్ర ఎన్నికల సంఘం వచ్చే ఏడాది ఫిబ్రవరి లో నిర్వహించాలని చేస్తుంది. అయితే , ప్రభుత్వం మాత్రం దానికి అనుమతించలేదు. కరోనా సమయంలో ఎన్నికలు అవసరమా అంటూ ప్రశ్నిస్తుంది. అయితే ఎన్నికల సంఘం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. దీనితో తాజాగా ఏపీ ప్రభుత్వం .. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని అసెంబ్లీలో తీర్మానం చేసింది. రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానంతో దానికి చెక్‌ పెట్టాలని వైసీపీ సర్కారు భావించింది.

అయితే , దీనిపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని ఆయన ఆక్షేపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243K కింద ఎన్నికల కమిషన్ కు స్వయం ప్రతిపత్తి ఉందని.. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరపడం ఎలక్షన్ కమిషన్ విధి అని వివరించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సమాన అధికారాలుంటాయన్న నిమ్మగడ్డ.. ప్రభుత్వ సమ్మతితోనే ఎన్నికలు జరపాలనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. అలాంటి ఆర్డినెన్స్ వస్తే తిరస్కరించాలని గవర్నర్ కు నిమ్మగడ్డ విజ్ఞప్తి చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టు న్యాయనిపుణులను సంప్రదించాలని సూచించారు.

ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికల అంశంపై 10నెలలుగా వివాదం కొనసాగుతోంది. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించడంతో ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. వెంటనే మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను ఎస్ఈసీగా నియమించింది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లిన రమేష్ కుమార్.. ప్రభుత్వంపై విజయం సాధించారు. తిరిగి ఎస్ ఈ సీగా ఛార్జ్ తీసుకున్న అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయం లో ప్రభుత్వం , నిమ్మగడ్డ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.