హైదరాబాద్ నుంచి నైజీరియన్ల తిరుగుటపా!

Sun Sep 22 2019 13:23:57 GMT+0530 (IST)

Nigerian staying illegally deported

డ్రగ్స్ దందా - ఆన్ లైన్ మోసాల కారణంగా నైజీరియన్లంటే చాలామంది భయపడుతున్నారు. కానీ విద్యా అవకాశాల పేరిట పెద్దసంఖ్యలో నైజీరియన్లు హైదరాబాద్ - దేశంలోని ఇతర నగరాలకు వస్తున్నారు. ఇక్కడే ఉంటూ డ్రగ్స్ వ్యవహారాల్లో ఉంటుండడంతో పాటు ఆన్ లైన్ మోసాలకూ పాల్పడుతూ పోలీసు శాఖను ముప్పతిప్పలు పెడుతున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ - ఆన్ లైన్ మోసాలకు సంబంధించిన దాదాపు ప్రతి కేసులోనూ నైజీరియన్ల ఇన్వాల్వ్ మెంట్ కనిపిస్తోంది. దీంతో వీరి బెడద నివారణకు హైదరాబాద్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. చదువు పేరిట - ఇండియాలో పర్యాటక ప్రదేశాలను తిరుగుతామని చెబుతూ - వివిధ రకాల వీసాలపై ఆఫ్రికా దేశాల నుంచి వచ్చి - నేరాలకు పాల్పడుతూ - కోట్లు కొల్లగొడుతున్న వారిపై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించారు.ఇండియాలోనే తొలిసారిగా - ఓ నైజీరియా నేరస్తుడిని పట్టుకుని - అతని దేశానికి తిప్పి పంపించారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ తెలిపారు. దొరికిన వారిని దొరికినట్టు వారి దేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేశామని - ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు.

వైద్య - విద్యార్థి - పర్యాటక వీసాలపై వస్తున్న నైజీరియన్లు - ఇండియాలో నేరాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. ఇటీవలే మెడికల్ అటెండింగ్ వీసాపై ఇండియాకు వచ్చిన వాలెంటైన్ కెవిన్ అనే యువకుడు - వీసా గడువు ముగిసిన తరువాత కూడా నాలుగున్నర ఏళ్లు ఇండియాలో ఉన్నాడని అన్నారు. అతన్ని దిల్లీ  శివార్లలో అరెస్ట్ చేశామని - పలువురు అమాయకులను లక్షల్లో ముంచేశాడని సజ్జనార్ వివరించారు.