అదేంది సారూ.. రూ.15 కోట్ల హామీ కూడా అమలు చేయకపోవటమా?

Tue Jun 28 2022 09:44:11 GMT+0530 (IST)

News update on cm KCR

మాటలు చెప్పటానికి ఖర్చు ఉండదు. కానీ.. చెప్పిన మాటల్ని చేతల్లో చేసి చూపించటానికి మాత్రం కచ్ఛితంగా డబ్బులు ఖర్చు అవుతాయి. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే మాటలకు.. చేసే చేతలకు మధ్య అంతరం ఎంతన్న విషయాన్ని తెలియజేసే వైనం కళ్లకు కట్టినట్లుగా కనిపించే పరిస్థితి.మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాలకు నిన్నటితో ఆఖరు. ఈ రోజు 101 జయంతి. శత జయంతిని పురస్కరించుకొని ఏడాది మొత్తం పీవీ ఖ్యాతిని చాటేలా చేయటంతో పాటు.. పలు కార్యక్రమాల గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ భారీగా హామీలు ఇవ్వటం తెలిసిందే.

పలు ప్రభుత్వ పథకాలకు పీవీ పేర్లు పెడతామని.. ఆయన పుట్టిన వంగరను అద్భుత పర్యాటక కేంద్రం చేస్తామని చెప్పటంతో పాటు.. మరిన్ని హామీల్ని ఇచ్చారు. కానీ.. అవేమీ ముందుకు కదలకపోవటం గమనార్హం. పీవీ ఠీవీని ప్రపంచానికి చాటి చెప్పేలా చేస్తామని సినిమా డైలాగులు చెప్పిన కేసీఆర్.. చేతల్లో మాత్రం ఏమీ చేయలేకపోయారని చెప్పాలి.

శత జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. ‘‘పీవీ ఖ్యాతిని చాటి చెప్పేలా.. కీర్తి ప్రతిష్ఠలు తెచ్చేలా ఆయన శత జయంతి ఉత్సవాల్సిన నిర్వహిస్తాం. తెలుగోడు.. తెలంగాణలో జన్మించిన పీవీ పేరిట వివిధ ప్రాంతాల్లో పలు కార్యక్రమాల్ని నిర్వహిస్తాం. ఆయనకు ఘన నివాళిని అర్పిస్తాం. పీవీ జన్మస్థలమైన వంగరను అన్ని విధాలుగా డెవలప్ చేస్తాం.. అప్పుడే పీవీకి ఘన నివాళి’ అంటూ చెప్పిన కేసీఆర్.. గడిచిన ఏడాదిలో చేసిందేమీ లేదన్న మాట వినిపిస్తోంది.

వంగరలో రూ.15 కోట్లతో ప్రభుత్వం చేస్తామన్న ఏ పని పూర్తి కాలేదని.. ఆ మాటకు వస్తే అసలు ప్రారంభమే కాలేదని చెబుతున్నారు. నిజానికి ఈ పనుల్ని పర్యాటక.. ఆర్ అండ్ బీ శాఖల ద్వారా చేయాలని చెప్పినా.. అవేమీ ముందుకు సాగలేదు. రూ.7 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేద్దామని భావించిన వేదికకు రూ.3 కోట్ల పనులు మాత్రమే జరగ్గా.. కాంట్రాక్టర్ కు మాత్రం రూ.1.5 కోట్ల నిధులు మాత్రమే విడుదలయ్యాయి.  

ఇలా చెప్పిన హామీల్లో వేటిని పూర్తి చేయలేదని చెబుతున్నారు. మాజీ ప్రధాని పీవీని జాతీయ పార్టీలు నిర్లక్ష్యం చేశాయని.. ఆయన కీర్తి సరిగా చాటి చెప్పలేదని చెప్పిన కేసీఆర్ సైతం.. అదే తీరును ప్రదర్శించటం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. గులాబీ సారూ చెప్పే మాటలకు.. చేసే పనులకు ఏ మాత్రం సంబంధం ఉండదనటానికి ఇదో నిదర్శనమన్న మాట వినిపిస్తోంది.