Begin typing your search above and press return to search.

ఊరిస్తున్న మాడుగుల హల్వా : సైకిల్ ని కిల్ చేస్తున్నది ఎవరు...?

By:  Tupaki Desk   |   7 July 2022 1:30 AM GMT
ఊరిస్తున్న మాడుగుల హల్వా  :  సైకిల్ ని కిల్ చేస్తున్నది ఎవరు...?
X
కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలోని అతి ముఖ్యమైన నియోజకవర్గంగా మాడుగులను చెప్పుకోవాలి. ఈ నియోజకవర్గం ఒకనాడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఇక్కడ నుంచి అనేక సార్లు మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ గెలిచారు. ఆయన ఎన్టీయార్ పిలుపు మేరకు రెడ్డి సత్యనారాయణ మాస్టర్ ఉద్యోగానికి స్వస్తి చెప్పి మరీ రాజకీయాల్లోకి దూకారు. ఏకంగా రెండు దశాబ్దాల పాటు ఆయన పసుపు జెండాను ఎగురవేశారు. ఆయన తరువాత మాత్రం పరిస్థితి పూర్తిగా టీడీపీకి మారిపోయింది.

మాడుగులలో టీడీపీ కంచుకోటను తొలిసారి కాంగ్రెస్ పడగొట్టింది. 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కరణం ధర్మశ్రీ రెడ్డి సత్యనారాయణను ఓడించారు. ఆ తరువాత 2009 ఎన్నికలలో మళ్ళీ టీడీపీ తరఫున గవిరెడ్డి రామానాయుడు గెలిచారు. కానీ 2014 నుంచి ఇప్పటికి రెండు సార్లు వైసీపీ తరఫున బూడి ముత్యాల నాయుడే గెలుస్తూ వస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో మరో మారు గెలిచేందుకు ఆయన అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఇపుడు మలి విడత విస్తరణలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి జగన్ ఆయన్ని మరింత శక్తిమంతుడిని చేశారు.

అయితే బూడి పట్ల జనాలలో అసంతృప్తి ఉన్నా దానిని మించి టీడీపీలో ఉన్న అనైక్యత ఆ పార్టీ పుట్టె ముంచుతోంది అని చెప్పాలి. ఇక మరో వైపు చూస్తే రెండు ఎన్నికలలో వరస ఓటమితో టీడీపీలో పూర్తి నైరాశ్యం కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఒక వర్గాన్ని కొనసాగిస్తారు. తనకే టికెట్ కావాలని ఆయన పట్టుపడుతున్నారు.

ఈ నేపధ్యంలో టీడీపీ అధినయాకత్వం నియోజకవర్గం ఇంచార్జి బాధ్యతలను పీవీజీ కుమార్ కి అప్పగించింది. ఇక నాటి నుంచి అటు గవిరెడ్డి ఇటు కుమార్ వర్గాలు పోరు సాగిస్తున్నాయి. ఈ మధ్యలో పైలా ప్రసాదరావు కూడా తన మటుకు తాను టికెట్ ఆశతో మూడవ వర్గాన్ని పెంచుతున్నారు అన్న టాక్ ఉంది.

ఇలా టీడీపీలో వర్గ పోరు ఎక్కువగా ఉంది. గవిరెడ్డి ఆయన వన్ టైమ్ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. చంద్రబాబు ఆయనకు మరో రెండు సార్లు అవకాశం ఇచ్చినా కూడా గెలవలేకపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తమకు చాన్స్ ఇస్తారని పైలా ప్రసాదరావుతో పాటు పీవీజీ కుమార్ అనే ఇద్దరు నేతలు ఎవరి మటుకు వారు గట్టిగా ట్రై చేసుకుంటున్నారు.

చిత్రమేంటి అంటే ఈ ఇద్దరు నాయకులకూ నియోజకవర్గం మొత్తం మీద బలం లేదు. ఇక టీడీపీలో ముగ్గురి కీలక నేతల మధ్య ఐక్యత అన్నది లేదు ఉంటే టీడీపీకి అది బలమే. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా సొంత పార్టీ వారే ఓడిస్తారు అని అంటున్నారు. అదే వైసీపీకి ప్రత్యేకించి బూడికి ప్లస్ అవుతోంది అని చెబుతున్నారు. మొత్తానికి అంతా కలసి మాడుగుల హల్వాను బూడికి మరోసారి తినిపించేస్తారా అన్న చర్చ అయితే ఉంది మరి.