Begin typing your search above and press return to search.

రాజకీయ ఠీవి : పీవీ వద్దనుకున్న రెండు పదవులు...?

By:  Tupaki Desk   |   28 Jun 2022 8:59 AM GMT
రాజకీయ ఠీవి : పీవీ వద్దనుకున్న రెండు పదవులు...?
X
ఆయన మెత్తగా కనిపించే కత్తిలాంటి వాడు. పొట్టిగా అగుపించే గట్టి వాడు. ఏమీ తెలియనట్లుగా ఉంటూనే అపర చాణక్యాన్ని ప్రదర్శించే గొప్ప నాయకుడు. ఏ నిర్ణయమూ తీసుకోకపోవడమూ ఒక గొప్ప నిర్ణయం అని కనిపెట్టి ఆచరించిన రాజకీయ పరిశోధకుడు. ఆయనే పాములపర్తి వెంకట నరసిం హారావు. ఆయన తాను విద్యార్ధి దశలో ఉండగా వందేమాతరం గీతాన్ని ఆలపించి నాటి విద్యా సంస్థ యాజమాన్యం ఆగ్రహానికి గురి అయ్యారు. అలా చిన్ననాడే దేశభక్తిని నిండా నింపుకున్న పీవీలో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి.

ఆయన్ని రాజకీయ నాయకుడు అనేకంటే రాజనీతి కోవిదుడు అనడం సబబు. ఇంకా బాగా చెప్పాలీ అంటే దార్శనీకుడు అనాలి. పీవీ దూరదృష్టికి ఈ దేశం జోహార్ అంటోంది. ఆయన తెచ్చిన ఫలాలను ఈ రోజు అనుభవిస్తోంది అంటే నూటా నలభై కోట్ల మంది ప్రజానీకం ఆ మహానుభావుడికి రుణపడి ఉండాల్సిందే. ఈ దేశానికి నెహ్రూ తొలి ప్రధానిగా ఉంటూ ఆధునిక భారతాన్ని తనదైన శైలిలో రూపకల్పన చేశారు.

నెహ్రూ మార్గంలో దేశం యాభై ఏళ్ళు నడచింది. అదే టైమ్ లో ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. భారత్ మాత్రం బాగా వెనకబడిపోయింది. ఒక దశలో ఈ దేశం బంగారం కూడా కుదువపెట్టుకునే పరిస్థితిని చంద్రశేఖర్ ప్రధానిగా ఉండగా ఎదుర్కొంది. ఇదంతా 1990 దశకంలో జరిగిన ముచ్చట. ఆ టైమ్ లో వచ్చిన మధ్యంతర ఎన్నికలు, రాజీవ్ గాంధీ ప్రచారం చేస్తూనే తమిళ‌నాడులోని శ్రీ పెరుంబుదూర్ లో మానవ బాంబులతో మరణించడం ఇలా చాలా జరిగిపోయాయి.

అలా దేశానికి అనూహ్యంగా 1991 జూన్ నెలలో అంటే ఇప్పటికి 31 ఏళ్ళ క్రితం పీవీ ప్రధాని అయ్యారు. నాటికి ఆర్ధిక పరిస్థితి కడు భయంకరం. అలాంటి నేపధ్యంలో దేశంలో ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టి అన్ని గేట్లూ తెరచి మొత్తం ప్రపంచంతో భారత్ ని కలిపేసిన మహానుభావుడు పీవీ. ఫలితంగా భారత్ గడచిన మూడు పదుల కాలంలో సాధించిన అభివృద్ధి ఎనలేనిది. అలా నెహ్రూ ఒక వైపు భారతాన్ని చూస్తే రెండవ వైపు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధానిగా చూసి దేశాన్ని గొప్ప మలుపు తిప్పిన దార్శనీకుడుగా పీవీఎని చెప్పుకోవాలి.

ఇక పీవీని పదవులు వాటంటత అవే వరించి వచ్చాయి. ఆయన 1957లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించిన పీవీ 1971లో ఉమ్మడి ఆంధ్రాకు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికి జై తెలంగాణా ఉద్యమం మంచి పీక్స్ లో ఉంది. దాంతో పీవీ లాంటి నాయకుడు అయితేనే పార్టీలో బలమైన వర్గాలతో పాటు ఇతర వర్గాలను కలుపుకుని పోగల వారు అని ఇందిరాగాంధీ భావింది ఆ పదవి అప్పగించారు. అలా పీవీ ముఖ్యమంత్రి కోరుకోకుండానే అయ్యారు. కొన్నాళ్ళ పాటు ఆ హోదాను చవిచూశారు.

ఇక ఆ తరువాత ఆయా చూపు జాతీయ రాజకీయాల మీద పడింది. అలా ఆయన పాతికేళ్ళకు పై చిలుకు జాతీయ రాజకీయాల్లో రాణించారు. ఇక తన అవసరం పార్టీకి లేదు అనుకుని 1991 ప్రాంతంలో పెట్టే బేడా సర్దుకుని హైదరాబాద్ కి మకాం మార్చుకుంటున్న దశలో దేశానికి ప్రధానిగా అవకాశం వచ్చింది. ప్రధానిగా పీవీ సాధించిన విజయాలు గొప్ప రికార్డుగా చరిత్రలో ఉన్నాయి. అదే టైమ్ లో ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు కూడా దేశానికి కొత్త పధాన్ని పరిచయం చేశాయి.

ఇక పీవీ చమత్కారం గురించి ఒక చిన్న ముచ్చట ఇక్కడ చెప్పుకోవాలి. ప్రధానిగా పీవీ 1992లో విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా విశాఖలో నాడు జరిగిన సభలో ఆయనకు అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి ఎదురుబొదురుగా చూసుకుంటూ ఉన్న రెండు ఏనుగుల బొమ్మను బహూకరించారు. దాన్ని చూసిన పీవీ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితికి అది అద్దం పడుతోందా అని చమత్కరించారు. నాడు కాంగ్రెస్ లో విపరీతమైన వర్గ పోరు ఉండేది. దాన్ని ఆయన దృష్టిలో ఉంచుకుని ఈ సరదా చమక్కులతోనే కాంగ్రెస్ వారిని చురుక్కుమనేలా చేశారన్న మాట.

పీవీ కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు, మంచి సాహితీవేత్త. తెలుగులో కవి సమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ రచించిన వేయి పడగలు నవలను ఆయన సహస్ర ఫణి అని హిందీలో అద్భుతంగా అనువదించారు. ఇక పీవీ తన జీవిత చరిత్రను ది ఇన్సైడర్ గా రాసి సంచలన విషయాలు ఎన్నో అందులో పొందుపరచారు. ఆయన స్వయంగా రచయిత, కవి. వక్త. అంతే కాదు దాదాపుగా పదహారు భాషలలో అనర్గళంగా మాట్లాడే నేర్పు ఆయన సొంతం.

ఇక విదేశాంగ శాఖ అంటే పీవీనే గుర్తుకు వస్తారు. అలాగే ఇందిరాగాంధీకి విశ్వాసపాత్రునిగా ఉంటూ కాంగ్రెస్ కి ఎనలేని సేవ చేశారు. పీవీ లాంటి వారు అరుదుగా జన్మిస్తారు. అలాంటి మేలి రకం నాయకుడిని మళ్ళీ చూడగలమా అంటే అచ్చంగా అది సందేహమే.