మేకపాటికి మంత్రిపదవి లేనట్లే

Tue Jun 28 2022 11:21:03 GMT+0530 (IST)

News update about Mekapati Vikram Reddy

తాజాగా జరిగిన ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికలో గెలిచిన మేకపాటి విక్రమ్ రెడ్డికి మంత్రిపదవి లేనట్లే అని తేలిపోయింది. గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని మేకపాటి కలిసారు. తర్వాత మీడియాతో మాట్లాడిన మేకపాటి మంత్రి పదవి విషయంలో స్పందిస్తు తానిప్పుడే ఎంఎల్ఏగా గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. మంత్రిపదవి అందుకునేందుకు తనకు అర్హత కూడా లేదని స్పష్టంగా ప్రకటించేశారు.మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఉపఎన్నికలో గెలవగానే మేకపాటి విక్రమ్ ను జగన్ మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం బలంగా జరిగింది. నిజానికి విక్రమ్ ను ఇపుడు మంత్రివర్గంలోకి తీసుకునేందుకు అవకాశం కూడా లేదు.

రేపేదైనా సమీకరణలు సానుకూలమైతే అప్పుడు మంత్రివర్గంలోకి తీసుకోవటం ఖాయమనే ప్రచారం జరిగింది. ఎందుకంటే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిపైన జగన్ కున్న అపారమైన అభిమానంతోనే సోదరుడికి అవకాశం ఇస్తారని అందరు అనుకున్నారు.

అయితే ఈ టర్మ్ లో విక్రమ్ కు మంత్రిపదవి అవకాశం లేదని తేలిపోయింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే అప్పుడు మంత్రిపదవి ఇచ్చేది లేనిదే ఇప్పుడే చెప్పలేరు. విక్రమ్ మాట్లాడుతు ఎంఎల్ఏగా గెలిచిన తాను నేర్చుకోవాల్సింది చాలావుందన్నారు. నియోజకవర్గంలో తిరిగి పట్టుపెంచుకోవాలని చెప్పారు. నేతలతోను ప్రజాలతోను రెగ్యులర్ గా సంబంధాలు పెట్టుకుని సమస్యల పరిష్కారానికి చేయాల్సింది చాలా ఉందన్నారు.

తన సోదరుడు గౌతమ్ అసంపూర్తిగా వదిలేసిన పనులను పూర్తిచేయాల్సిన బాధ్యత తనపైనే ఉందని గుర్తుచేసుకున్నారు. ముందు నియోజకవర్గం అభివృద్ధిపైన మాత్రమే తాను దృష్టిపెడుతున్నట్లు ప్రకటించారు. జిల్లా అభివృద్ధితో పాటు నియోజకవర్గం అభివృద్ధికి గౌతమ్ చేసిన కృషిని తాను కంటిన్యుచేస్తానన్నారు.

అభివృద్ధి పనులను పూర్తిచేయటానికి అవసరమైన సహకారం అందించాలని తాను సీఎంను విజ్ఞప్తి చేసినట్లు విక్రమ్ తెలిపారు. నిజానికి విక్రమ్ కు ఇపుడు మంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకుంటే జగన్ కు పెద్ద కష్టంకాదు. కానీ ఆపని చేస్తే ఎవరోఒకరిని తప్పించాల్సుంటుంది. మొన్నటి మార్పులు చేర్పులతోనే కొన్ని తలనొప్పులు వచ్చాయి.  దాన్ని దృష్టిలో పెట్టుకునే విక్రమ్ విషయాన్ని పక్కనపెట్టేశారని టాక్ నడుస్తోంది.