సత్యం పలుకుడీ : సజ్జల సార్ చెప్పేదంతా....?

Wed Jul 06 2022 19:08:21 GMT+0530 (IST)

News on sajjala ramakrishnareddy

వైసీపీ ప్రభుత్వ సలహాదారుడిగా సజ్జల రామక్రిష్ణారెడ్డి పదవి ఘనమైనది బరువైనది. ఆయన తనదైన  మాటల శైలితోనే పార్టీ ప్రభుత్వం పరువుని మోస్తూ ఉంటారు. లేటెస్ట్ గా సజ్జల చేసిన కొన్ని కామెంట్స్ చిత్రంగా తోస్తున్నాయని జనాలు  అంటున్నారు.ఇంతకీ ఆయన ఏమన్నారు అంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏ ఒక్క బిల్లుకూ వైసీపీ మద్దతు ఇవ్వలేదని. నిజంగా ఇది నిజమేనా సజ్జల సారు వారూ అంటే ఆయన  జవాబు ఎస్ అనే చెబుతారు. కానీ ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటూ చూస్తే లెక్క తీస్తే మాత్రం అబ్బ నిజమా అని జనాలు అంటారేమో.

ఎందుకంటే  వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు రైతుల మోటార్లకు మీటర్లు బిగించే దానికీ ఇంకా చెప్పాలంటే అనేక ఇతర కీలకమైన బిల్లులకు వైసీపీ మద్దతు ఇచ్చిందని చెబుతారు. అలాగే కాశ్మీర్ విభజన బిల్లు సహా అనేక వాటికి కూడా వైసీపీ రాజ్యసభలో మద్దతు ఇచ్చిందని చూపిస్తారు.  ఇందులో జనామోదం అయినవి ఉన్నాయి వివాదాలు అయినవీ ఉన్నాయి. కానీ అసలు మద్దతే ఇవ్వలేదు అని వైసీపీ అనడంతోనే చిట్టా బయట పెట్టాల్సి వస్తోందని అంటున్నారు.

ఇక 2017లో వైసీపీ విపక్షంలో ఉంది. అయినా సరే రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చిందని కూడా ఎవరైనా గుర్తు చేస్తారు. ఇపుడు మళ్ళీ బీజేపీ అభ్యర్ధులకే రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఓటేయబోతోంది. మరి సజ్జల వారు మాత్రం తూచ్ మేమే బిల్లుకీ మద్దతు ఇవ్వలేదు అని చెబుతున్నారు.

రీసెంట్ గా వైసీపీకి చెందిన ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అయితే మూడేళ్ళుగా కేంద్రానికి అనేక విషయాల్లో పూర్తి మద్దతు ఇస్తున్నామని ఈ కారణంగానే కేంద్రం నుంచి దండీగా నిధులను తెచ్చుకుంటున్నామని భారీ ప్రకటన చేశారు. మరి ఆయన అలా చెబుతూంటే సజ్జల మాత్రం అబ్బే అలాంటిది ఏదీ లేదని అంటున్నారు. అంతే కాదు బీజేపీ వైసీపీ సిద్ధాంతాలు వేరు అని అంటున్నారు.

ఈ మాట మాత్రం కరెక్ట్. బీజేపీ పొలిటికల్ ఫిలాసఫీకి వైసీపీ పార్టీ సిద్ధాంతాలకు తేడా ఉంది. కానీ మద్దతు మాత్రం ఇస్తూనే ఉంటున్నారని విపక్షాలు అంటూంటే సజ్జల మాత్రం లేదనడమే చిత్రంగా ఉంది అంటున్నారు. రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడుని బీజేపీ నిలబెట్టలేదని తెలుగుదేశం పార్టీ వారు షాక్ లో ఉన్నారు అని సజ్జల మరో ఆరోపణ చేశారు. పెగాసస్ విషయంలో తప్పకుండా చర్యలు ఉంటాయని కూడా చెబుతున్నారు.  

ఇక నూరు శాతం ఎన్నికల హామీలను వైసీపీ నెరవేర్చిందని కూడా సజ్జల మరోసారి పూర్తి సత్యం కానీ సత్యాన్ని జనాల ముందు పెట్టారని అంటున్నారు.  వైసీపీ చాలా హామీలు ఇచ్చింది. వాటిలో అమలు కానివి ఎన్నో ఉన్నాయని విపక్షాలు లిస్ట్ బయటపెడుతూంటే సెంట్ పర్సెంట్ అని ఎలా చెప్పుకుంటారు  సార్ అని అంతా అంటున్నారు. ఏది ఏమైనా తాను చెప్పినది సత్యమని సజ్జల వారు అనుకుంటే ఎవరేమి చేయలేరు అని నెటిజన్ల సెటైర్లు అయితే గట్టిగానే పడుతున్నాయి.