ఆ విషయాలు అసలు మాట్లాడరా...జీవీఎల్ సారూ

Sat Aug 13 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

News on gvl narasimha rao

బీజేపీకి కొన్ని మాటలే ఇష్టం. తాను అనుకున్న దానే పదే పదే చెబుతుంది. అదే జనం బుర్రల్లోకి ఎక్కాలని ప్రయత్నిస్తుంది. ఇక బీజేపీ నేతల తీరు కూడా అలాగే ఉంటుంది. ఏపీకి ఎంతో చేశామని చెబుతారు.కేంద్ర నిధులు వచ్చాయని అంటారు. కేంద్రమే లేకపోతే ఏపీ సంగతేంటి అంటూ పడికట్టు మాటలు వాడుతారు. అలా అంతా ఏదో కలగూరగంపలా మాట్లాడేసి మమ అనిపించేస్తారు.

అదే మీడియా ఎదురు నిలిచి ప్రత్యేక హోదా సంగతేంటి పోలవరం విషయం ఏంటి  రాజధాని నిధుల వైనమేంటి అని అడిగితే మాత్రం మళ్లీ ఆవు కధ మాదిరిగా ఏపీకి ఎంతో చేశామని బీజేపీ నేతలు  చెబుతూ వస్తారని అంటున్నారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా ఇదే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన ఈ మధ్య తరచూ విశాఖ టూర్లు వేస్తున్నారు.

బహుశా వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేయాలన్న కోరిక ఉందేమో తెలియదు కానీ విశాఖ వస్తారు మీడియాతో ముచ్చటిస్తారు. అయితే జీవీఎల్ తాజా టూర్ లో మీడియా కలిసినా అసలు విషయాలు చెప్పకుండా మాట దాటించేయడం విశేషం.

ఇంతకీ మీడియా అడిగింది ఏమిటి జీవీఎల్ చెప్పింది ఏమిటీ అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి గట్టిగానే మీడియా అడిగింది. దానికి జీవీఎల్ సార్ జవాబు చెప్పకుండా ఏవేవో మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ గురించి అడిగినా అంతే. ఇక ప్రత్యేక  హోదా వంటి విషయాలు గురించి అసలు ఆయన చెబుతారా.

ఇంతకీ జీవీఎల్ సార్ చెప్పింది ఏంటి అంటే కేంద్రంలోని బీజేపీ విశాఖకు చాలా చేసింది అంటూ గొప్పలు చెప్పడం డబ్బా కొట్టడం అంటున్నారు. సరే అన్ని చేసిన బీజేపీ అర్ధ శతాబ్దం నాటి ఉక్కు కర్మాగారం ఏపీకే తలమానికం లాంటి విశాఖ ఉక్కు కర్మాగారం గురించి దాని బతుకు ప్రైవేట్ పరం అవుతున్న దుస్థితి గురించి మాత్రం ఎందుకు మాట్లాడరు అంటే. అంతే ఆ కధ కంచికి చేరుతోంది కాబట్టే అంటున్నారు. మొత్తానికి జీవీఎల్ సారూ ఆ విషయాలు మాట్లాడరా అని అంతా అంటున్నారు.