Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు సేమ్ స్ట్రాట‌జీ.. ?

By:  Tupaki Desk   |   6 Dec 2022 2:30 AM GMT
చంద్ర‌బాబు సేమ్ స్ట్రాట‌జీ.. ?
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు సేమ్ స్ట్రాట‌జీని అమలు చేయాల‌ని నిర్ణ‌యించారు. త్వ‌ర‌లోనే పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ స‌మావేశాల్లో గ‌తంలో అనుస‌రించిన వ్యూహాల‌ను తిరిగి రిపీట్ చేయాల‌ని ఆయ‌న టీడీపీ ఎంపీల‌కు సూచించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలోని గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ఇంట్లో నిర్వ‌హించారు. ఈ సమావేశానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షత వహించారు. మ‌రో రెండు మూడు రోజుల్లో ప్రారంభ‌మ‌య్యే పార్లమెంట్ స‌మావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు ఆయ‌న దిశా నిర్దేశం చేశారు.

ఈ స‌మావేశానికి విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, శ్రీకాకుళం ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు, రాజ్య‌స‌భ‌స‌భ్యుడు క‌న‌క మేడ‌ల ర‌వీంద్ర కుమార్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు వారికి కొన్ని సూచ‌న‌లు చేశారు. గ‌త పార్ల‌మెంటు స‌మావేశాల్లో పార్టీ బ‌లంగా ప‌నిచేసింద‌ని చెప్పారు. అదేవిధంగా ఈ పార్ల‌మెంటు స‌మావేశాల్లోనూ ఏపీలో స‌మ‌స్య‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని ఏపీలో ప్ర‌భుత్వం చేస్తున్న అరాచ‌కాల‌ను ఎత్తి చూపాల‌ని.. పార్ల‌మెంటులో వైసీపీ స‌భ్యుల ప్ర‌సంగాల‌కు కౌంట‌ర్లు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు సూచించారు.

గ‌త పార్ల‌మెంటు స‌మావేశాల్లో వైసీపీ స‌భ్యులు లేవ‌నెత్తిన ప్ర‌తి అంశానికీ టీడీపీ స‌భ్యులు కౌంట‌ర్లు ఇచ్చారు. పోల‌వ‌రం విష‌యం లో వైసీపీ నేత‌లు అనుస‌రిస్తున్న విధానాల‌ను ఎంపీ గ‌ల్లా అప్ప‌ట్లో పార్ల‌మెంటు వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. దీంతో కేంద్రం కూడా నిధుల వినియోగంపై వివ‌రాలు కోరుతామ‌ని స‌భ‌లో ప్ర‌క‌టించింది. అదేవిదంగా రాజ‌ధాని విష‌యంలోనూ కేంద్రం అప్ప‌ట్లో అమ‌రావ‌తిగానే పేర్కొంది. మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న త‌మ‌కు అంద‌లేద‌ని తెలిపింది.ఇక‌, రాష్ట్రం చేస్తున్న అప్పులు, కేంద్రం ఇస్తున్న నిధుల దుర్వినియోగం వంటి విష‌యాల‌ను టీడీపీ స‌భ్యులు పార్ల‌మెంటులో లేవ‌నెత్తారు.

దీంతో గ‌త స‌భ‌లో వైసీపీ స‌భ్యులు ఎంత మంది ఉన్న‌ప్ప‌టికీ టీడీపీ స‌భ్యుల కౌంట‌ర్ ముందుకు నిల‌వ‌లేక పోయారు. ఒకానొక ద‌శ‌లో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి చేతులు ఎత్తి స్పీక‌ర్‌కు దండం పెట్టి మ‌రీ టీడీపీ స‌భ్యుల‌ను కూర్చోమ‌ని చెప్పాల‌ని వేడుకున్న ప‌రిస్తితి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో తాజాగా కూడా అదే ధాటిని ప్ర‌ద‌ర్శించి, వైసీపీని కౌంట‌ర్ చేయాల‌ని చంద్ర‌బాబు ఎంపీల‌కు సూచించారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధానంగా దృష్టి పెట్టాల‌ని చెప్పారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.