వైసీపీకి మూడొచ్చింది...మూడేది ఎవరికో....?

Tue Nov 29 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

News on ap politics ycp

మొత్తానికి వైసీపీ మంచి మూడ్ లో ఉంది. జోరు చేస్తోంది. హుషార్ చేస్తోంది. దానికి కారణం సుప్రీం కోర్టు అమరావతి రాజధాని విషయంలో విచారణ సందర్భంగా చేసిన కొన్ని కామెంట్స్. ఒక ప్రాంతంలో రాజధాని ఉండాలని కోర్టు ఎలా ఆదేశిస్తుంది అని సుప్రీం కోర్టు సంధించిన ప్రశ్న వైసీపీకి జోష్ తెచ్చేదే.అలాగే ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని ఎలా కోర్టు ఆదేశిస్తుంది అని కూడా వ్యాఖ్యలు చేసినట్లుగా ఉంది. దాంతో ఇపుడు వైసీపీ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దాంతో మరింత దూకుడుగా వికేంద్రీకరణ విధానాన్ని ప్రజలలోకి తీసుకుపోవాలని చూస్తోంది. అదే విధంగా తమ పార్టీ ఎన్నికల అజెండగా ఒక గంభీరమైన నినాదంగా మూడు రాజధానులను చేసుకోవాలని వైసీపీ భావిసోందని అంటున్నారు.

ఏపీలో చూస్తే అన్ని రాజకీయ పార్టీలు వైసీపీని యాంటీగానే ఉన్నాయి. అదే టైం లో అన్ని పార్టీలు అమరావతినే ఏకైక రాజధానిగా చేయాలని చెబుతున్నాయి. అది ఒక విధంగా వైసీపీకి ఇబ్బంది పెట్టేదిగా ఉంది. కానీ వికేంద్రీకరణ నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకుని వెళ్తే అదే స్లోగన్ తమకు ప్లస్ అయి విపక్షాలకు అతి పెద్ద ట్రబుల్ గా మారుతుంది అని కూడా తలపోస్తోంది.

దాంతో వచ్చే ఎన్నికల్లో ఇదే నినాదాన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకోవాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. దీని వల్ల అమరావతిలో కొంత ఇబ్బంది ఉన్నా రాయలసీమ ఉత్తరాంధ్రాలో మంచి ఫలితాలు రాబట్టవచ్చు అని వైసీపీ అంచనా కడుతోంది. మూడు రాజధానులు అన్నది జనాల బుర్రల్లోకి గట్టిగా ఎక్కితే మాత్రం తమకు తిరుగు ఉండదని ఆ పొలిటికల్ మైలేజ్ మొత్తానికి మొత్తం తమ సొంతం అవుతుందని కూడా లెక్క వేసుకుంటోంది.

అమరావతి రాజధాని అంటూ ఆ మైలేజ్ కోసం పోటీ పడడానికి టీడీపీతో పాటు మిగిలిన పార్టీలు ఉన్నాయి. కానీ మూడు రాజధానుల నినాదం సోలోగా వైసీపీదే. దాంతో పాటు సుప్రీం కోర్టు చేసిన కొన్ని కామెంట్స్ తమకు అనుకూలంగా ఉండడంతో దాన్ని ముందు పెట్టి మరింత స్పీడ్ గా ఆయన ప్రాంతాలలో రాజధాని ఆకాంక్షను రగిలిస్తే కనుక కచ్చితంగా విపక్షాలు రాజకీయంగా దెబ్బ తింటాయని వైసీపీ యోచిస్తోంది.

విపక్షాలు అన్నీ కలసి పోటీ చేసినా లేక విడివిడిగా చేసినా కూడా మూడు రాజధానుల అంశమే తమకు శ్రీరామ రక్షంగా మారి రక్షిస్తుంది అని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. ఇంతకంటే మంచి ప్లాన్ కూడా వేరేది లేదని కూడా ఊహిస్తున్నారుట. అదే విధంగా తమ ప్రాంతానికి మంచి జరుగుతుంది రాజధాని వస్తుంది అంటే అ సెంటిమెంట్ కి అంటుకోని వారు ఎవరూ ఉండరని అందువల్ల తమ రాజకీయ వ్యూహాలు నల్లేరు మీద నడకలా ముందుకు సాగిపోతాయని వైసీపీ నేతలు భావిస్తున్నారుట.

సాధ్యమైనత తొందరలో ఈ నినాదాన్ని ఇంకా బలంగా జనంలో పెట్టడానికి ఇప్పటి నుంచే వైసీపీ పధక రచన చేస్తోంది అని అంటున్నారు. డిసెంబర్ 5న కర్నూల్ లో న్యాయ రాజధాని కోసం భారీ ర్యాలీని సభను నిర్వహిస్తున్నారు. రానున్న రోజులలో ఉత్తరాంధ్రాలోనూ మరోమారు జేయేసీలు జూలు విదిల్చి మళ్లీ రంగంలోకి దిగుతాయని అంటున్నారు.

మరి వైసీపీ మూడు మీద మూడ్ పెంచుకుని బస్తీ మే సవాల్ అంటూ జోరు చేస్తే దాన్ని కంట్రోల్ చేయడానికి కౌంటర్ చేయడానికి విపక్షాలు ప్రత్యేకించి టీడీపీ ఏ విధమైన స్ట్రాటజీని సిద్ధం చేస్తుందో చూడాలి. మూడు తో విపక్షాలు మూడుతుంది అని వైసీపీ పెట్టుకున్న విశ్వాసం ఎంతవరకూ సక్సెస్ అవుతుంది అన్నది కూడా చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.