Begin typing your search above and press return to search.

అటు అసమ్మతి గన్...ఇటు వన్ టూ టెన్ జగన్

By:  Tupaki Desk   |   7 Feb 2023 8:00 AM GMT
అటు అసమ్మతి గన్...ఇటు వన్ టూ టెన్ జగన్
X
జగన్ మార్క్ పాలిటిక్స్ అంటేనే ఇది. ఆయన రాజకీయ అనుభవం అంతా గత చరిత్ర నుంచి వచ్చినదే. తన ముందు వారి నుంచి ఆయన నేర్చుకున్నదే. ఉమ్మడి ఏపీలో ఎన్టీయార్ వెన్నుపోటుకు రెండు సార్లు గురి అయ్యారు. ఇక వైఎస్సార్ విషయంలో అందరినీ నమ్మితే ఆయన చనిపోయాక ఎవరు ఎలా చెల్లాచెదురు అయ్యారో జగన్ స్వయంగా ఆ బాధను అనుభవించారు. అందుకే ఆయన తనదైన శైలిలో రాజకీయం చేస్తూ వస్తున్నారు.

వైసీపీని ఆయన ఒంటి స్థంభం మేడలాగ కట్టారు. పార్టీలో ప్రభుత్వంలో ఆయనే వన్ టూ టెన్. తన సొంత కుటుంబీకులు కూడా దరిదాపుల్లో లేరు. ఇక పార్టీలో కొందరు నేతల పేర్లు చెప్పుకున్నా వారంతా టెన్ తరువాతనే ఉంటారు. జగన్ కి ప్రభుత్వ పరంగా ఎవరైనా కాస్తా చెప్పగలరేమో కానీ పార్టీ పరంగా చూస్తే ఆయన మాట శిలాశాసనం. ఆయనను కాదని ఎవరూ ఏమీ చేయలేరు.

మరో వైపు చూస్తే 2019 ఎన్నికల్లో జగన్ విజయం ఆయన రెక్కల కష్టం. ఆయన పేరు, వైఎస్సార్ పేరుతోనే అధికారం దఖలు పడింది. 151 సీట్లు కూడా అలాగే లభించాయి. జగన్ ఇపుడు జనంతో కనెక్ట్ అయి ఉన్నారు. నాయకుడుగా ఆయన వైసీపీ నుంచి అగ్ర స్థానంలో కనిపిస్తున్నారు. ఆయనను చూసే ఓటేయాలి. ఆయన నచ్చితే ఓటేయాలి.

ఈ మధ్యలో చాలా మంది వచ్చినా వెళ్ళినా బే ఫికర్. అందుకే వైసీపీలో అసమ్మతి రాగాలు ఎక్కడ వినిపించినా అవి పూర్తిగా లోకలైజ్ అయిపోతున్నాయి. కనీసం నియోజకవర్గం దాటి ముందుకు సాగవు. ఇక అసమ్మతి నాయకులు ఎక్కడ ఉన్నా పార్టీ నుంచి బయటకు వెళ్ళడం తప్ప మరో మార్గం అయితే లేదు. పార్టీలో ఉంటూ ముఠాలు కట్టి పార్టీని ఇబ్బంది పెట్టేంత సీన్ అయితే లేదు.

ఇలా అసమ్మతి నాయకులు ఎంత మంది వెళ్ళినా వైసీపీకి జగన్ కి ఏమీ నష్టం లేదు అనే అంటున్నారు. ఆయన ధీమా కూడా అదే. ఎందుకంటే జగన్ని నమ్మే జనాలు గెలిపించారు. రేపటి ఎన్నికల్లో కూడా ఆయన్ని చూసే ఓటు వేస్తారు. చాలా కాలంగా అంటే నాలుగు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలు లీడర్ బేస్డ్ గా మారిపోయాయి. లీడర్ చరిష్మతోనే గెలుపు తొంబై శాతం ఉంటే పది శాతమే అభ్యర్ధి వంతు.

అలా కనుక చూస్తే వచ్చే ఎన్నికల్లో తాను టికెట్ ఇచ్చే అభ్యర్ధులను ఆ మేరకు సమర్ధత చూసుకుని తీసుకునే వెసులుబాటు జగన్ కి ఎటూ ఉంది. దాంతోనే ఆయన వైసీపీలో రెబెల్స్ కి ఏ మాత్రం తగ్గడంలేదు అంటున్నారు. నిజానికి జగన్ పార్టీని చాలా జాగ్రత్తగా నిర్మించుకున్నారు అని దీన్ని బట్టి తెలుస్తోంది. తెలుగుదేశంలో అయితే ఎన్టీయార్ తరువాత రెండు అధికార కేంద్రాలు అల్లుళ్ల నాయకత్వంలో ఉండేవి.

దాంతో పాటు ఎన్టీయార్ సరిసాటి నేతలు కూడా ఉండేవారు. దాని వల్ల పార్టీ పరంగా మంచి ఎంత జరిగిందో కానీ రెండు వెన్నుపోట్లు అయితే జరిగాయి. బహుశా అలాంటి అనుభవాలను చూసి జగన్ తన వైసీపీకి తానే రాజు తానే మంత్రిగా తయారు చేసుకున్నారు అని అంటున్నారు. వైసీపీలో రెండవ కేంద్రం అయితే లేదు. ఎవరికి వారు తాము జగన్ కి సన్నిహితులం అని చెప్పుకున్నా అసలు విషయం వేరుగా ఉంటుంది.

ఈ విధంగా పార్టీని ఏకశిలా సదృశ్యంగా నిర్మించడం వల్లనే జగన్ ఇపుడు హాయిగా ఉండగలుగుతున్నారు అని అంటున్నారు. పార్టీలో ఉండేవారు జగన్ అంటే విధేయతతో ఉంటారు. లేని వారు అలా కాని వారు ప్రత్యర్ధి శిబిరంలో తేలాల్సిందే తప్ప సొంత పార్టీలో మరో నలుగుర్ని కూడగట్టి హడావుడి చేసే సీన్ కానీ చాన్స్ కానీ అయితే లేదు అనే అంటున్నారు.

మొత్తానికి చూస్తే చంద్రబాబు టీడీపీకి కూడా ఆయనే ఒకే ఒక నాయకుడు అయినా నందమూరి వంశీకుల నుంచి ఎంతో కొంత వత్తిడి అయినా ఉంది. వైసీపీలో జగన్ కి అయితే అలాంటి పేచీ పూచీలు అయితే లేవు అంటున్నారు. అందుకే ఆయన తాను అనుకున్న తీరున ముందుకు సాగుతున్నారు. ప్రతీ చెడ్డా మంచికే అని ఆయన కొత్త వ్యూహాలు రచిస్తున్నారు అని అంటున్నారు.వర్తమాన రాజకీయాల్లో ఎలా ఉండాలో వైసీపీ పార్టీ నిర్మాణం మరో పాఠంగా మారినా ఆశ్చర్యం లేదేమో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.