ప్లీనరీ కళ కట్టిస్తారా : కార్యకర్త వైపే చూపు ...?

Thu Jul 07 2022 06:00:01 GMT+0530 (IST)

News on YCP

చాలా ఆలస్యంగా అయినా కార్యకర్తల వద్దకు పార్టీ పెద్దలు ఇపుడు వస్తున్నారు అని అంటున్నారు. అధికారంలోకి రావడానికి పదేళ్ల పాటు పాటు పడిన కార్యకర్తని ఏ మాత్రం నాయకులు పట్టించుకోని స్థితిని మూడేళ్ళుగా వారు చూశారు. ఎన్నో చేదు అనుభవాలను కూడా కాచి వడబోశారు. అయితే వైసీపీ ప్లీనరీ వేళ కార్యకర్తల గురించే పూర్తి ఫోకస్ పెడతారు అని వార్తలు వస్తున్నాయి.ఈ మధ్య ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా వెంట రాని కంట కనబడని కార్యకర్తలకు పెద్ద పీట వేస్తామని అంటున్నారు. ఇక ఇప్పటిదాకా ప్రభుత్వ సారధిగానే వ్యవహరించిన జగన్ అధికార కార్యక్రమాలలో పాలుపంచుకుని అక్కడే బిజీగా ఉంటున్నారు. సమీక్షలు చేస్తున్నారు. వీలైతే జిల్లా టూర్లు పెట్టుకుని అక్కడ సభలలో పాలుపంచుకుంటున్నారు.

ఈ టోటల్ ఎపిసోడ్ లో క్యాడర్ తో మాత్రం ఎక్కడా కలిసింది లేదు. దాంతో వారు తమ బాధలను చెప్పుకునే వేలు లేదని వాపోతున్నారు. ఇక ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు మంత్రులు అయ్యారు. పదవులలో ఉన్నారు. వారు సైతం క్యాడర్ ని పెద్దగా పట్టించుకోవడంలేదు

దాంతో విసిగి వేసారిన క్యాడర్ పార్టీకి చాన్నాళ్ళుగా దూరంగా ఉంటోంది. 2017 వైసీపీ ప్లీనరీలో ఉరకలెత్తిన క్యాడర్ ఈసారి మాత్రం అలిగి దూరంగా ఉందని టాక్ నడుస్తోంది. క్యాడర్ లో అసంతృప్తి ఉందని ఎన్నికల వ్యూహకర్త రుషిరాజ్ సింగ్ బృందం కూడా నివేదికలో పేర్కొంది అని చెబుతున్నారు. దాంతో అలెర్ట్ అయిన వైసీపీ పెద్దలు ప్లీనరీ సాక్షిగా వారిని ఫోకస్ చేయాలని నిర్ణయించారని అంటున్నారు.

వైసీపీ ప్లీనరీ ఈ నెల 8 9 తేదీలలో రెండు రోజుల పాటు గుంటూరులో  సాగనుంది. ఈ రెండు రోజులూ పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమాలను పక్కన పెట్టి జగన్ పార్టీ సమావేశాల్లోనే బిజీ అవుతారు అంటున్నారు. ఈ సందర్భంగా సీఎం కార్యకర్తలను కలుసుకునేందుకు ఆసక్తిని చూపిస్తారు అని అంటున్నారు.

ఇక క్యాడర్ లో మెరికల్లాంటి వారిని గుర్తించి వారికి వరాలు ఇవ్వాలని వారికి కూడా ప్రభుత్వ పరంగా చేయాల్సింది చేయాలని కూడా భావిస్తున్నారుట. మొత్తం 120 నియోజకవర్గాలలో బలమైన క్యాడర్ కి త్వరలో సముచితమైన స్థానం కల్పించేలా చర్యలు ఉంటాయని చెబుతున్నారు.

సరే ఇవన్నీ ఇలా ఉంటే ఈసారి ప్లీనరీకి కార్యకర్తలు ఎంత సంఖ్యలో హాజరు అవుతారు. వారు కనుక వస్తే ఏమేమి చెబుతారు అన్న ఆసక్తి అయితే ఉంది. అలాగే వారు కనుక తమ అసంతృప్తిని ఓపెన్ గా  వెళ్లగక్కితే అది కూడా జగన్ సమక్షంలో మాట్లాడితే మాత్రం సంచలనమే అవుతుంది. అయితే క్యాడర్ అలా చేయకుండా బుజ్జగించే చర్యలు అయితే ఇప్పటి నుంచే మొదలయ్యాయి అంటున్నారు. చూడాలి మరి క్యాడర్ కి వైసీపీ హై కమాండ్ ఇచ్చే వరాలు ఆ వివరాలు ఏమిటో.