Begin typing your search above and press return to search.

ముందస్తా..? మనుగోడు ఉప ఎన్నికా..?: టీఆర్ఎస్ లో చర్చ..

By:  Tupaki Desk   |   6 Aug 2022 11:30 PM GMT
ముందస్తా..? మనుగోడు ఉప ఎన్నికా..?: టీఆర్ఎస్ లో చర్చ..
X
తెలంగాణలో ‘మునుగోడు’ రాజకీయ వేడి సంతరించుకుంది. ఆ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. దీంతో రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదిస్తారా..? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది. ఒక దశలో ఆయన రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక ఉంటుందని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. బీజేపీ నుంచి ఎలాగూ రాజగోపాల్ రెడ్డి ఉండగా.. కాంగ్రెస్ నుంచి చెరుకు సుధాకర్ ను రంగంలోకి దించేందుకు ప్లాన్ వేస్తోంది. అయితే టీఆర్ఎస్ మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. దీంతో టీఆర్ఎస్ కు అసలు ఉప ఎన్నిక నిర్వహించడం ఇష్టమేనా..? అని అనుకుంటున్నారు. ఇదే తరుణంలో ఉప ఎన్నిక కాదని ఏకంగా ముందస్తుకు వెళుతారా..? అనే చర్చ సాగుతోంది.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి మొదటి ఐదేళ్లు ఏ ఎన్నిక జరిగినా ఆ పార్టీదే హవా సాగుతూ వస్తోంది. అయితే రెండో పర్యాయం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులపై అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. ఇదే క్రమంలో బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గాన్ని అతి కష్టం మీద కైవసం చేసుకుంది. కానీ ఆ తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమాత్రం అంచనాలు లేకున్నా టీఆర్ఎస్ కు గట్టిపోటీనిచ్చింది. అయితే ఒక్క నియోజకవర్గం గెలుచుకోగానే బీజేపీకి బలం పెరిగిపోదని టీఆర్ఎస్ నేతలు అనుకున్నారు. కానీ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని సైతం బీజేపీ లాగేసుకోవడంతో టీఆర్ఎస్ లో ఆందోళన పెరిగింది.

ఇదే సమయంలో గులాబీ పార్టీలో ఎంతోకాలంగా ఉన్నా పదవులు దక్కని చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఇతర పార్టీల వైపు చూశారు. కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునేలా లేదు. అందుకే వీరికి బీజేపీ ప్రత్యామ్నాయంలా కనిపించింది. పైగా కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన కొన్ని పథకాల్లో స్థానిక నాయకులు అవినీతి పెరిగిపోయింది. దీంతో ప్రజల్లో ఆ నాయకులతో పాటు పార్టీపై కూడా అసంతృప్తి పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో కేంద్రంతో పాటు రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో చాలా మంది నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారు.

తాజాగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం ఇదే ధోరణితో బీజేపీలోకి చేరబోతున్నారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే బాటలో ఉన్నారు. నిన్నటి వరకు ఎలాంటి చడీ చప్పడు లేని దాసోజు శ్రవణ్ ఏకంగా బండి సంజయ్ తో కలిసి ఢిల్లీ పయనమయ్యారు. దీంతో అనుకోకుండా బీజేపీకి బలం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ప్రజల్లోనూ ఇక టీఆర్ఎస్ పని అయిపోయిందన్న భావనలో పడుతున్నారు. ఇదే ఊపులో మునుగోడు ఉప ఎన్నిక జరిగితే తమదే విజయమని బీజేపీ ఇప్పటికే ప్రచారం చేసుకుంటోంది. అయితే టీఆర్ఎస్ మాత్రం ఇప్పుడు ఉప ఎన్నిక నిర్వహించడం లాభమా..? నష్టమా..? అని ఆలోచనలో పడింది.

సాధారణంగా ఉప ఎన్నిక అనగానే కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి కార్యాచరణను మొదలుపెట్టేవారు. ఆ నియోజకవర్గానికి నిధులు భారీగా కేటాయించేవారు. హుజూరాబాద్ విషయంలో అదే చేశారు. కానీ మునుగోడు విషయానికొచ్చేసరికి ఎలాంటి ఉత్సాహం చూపించడం లేదు. దీంతో మునుగోడు ఉప ఎన్నిక నిర్వహిస్తే అనుకోని పరిస్థితుల్లో సీటు జారితే వచ్చే ఎన్నికల్లో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు మునుగోడులో ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఆదరించేవారు తక్కువవుతారు.

అయితే ఇప్పటికిప్పుడు ఉన్న పథకాలకు భారీగా నిధులు కేటాయించి.. అవసరమైతే కొత్త పథకాలు ప్రకటించి నేరుగా ముందస్తు ఎన్నికల్లోకి వెళ్లడం బెటరని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కేసీఆర్ రాజగోపాల్ రెడ్డి రాజీనామాను యాక్సెప్ట్ చేయించకుండా వెయిట్ చేయిస్తున్నాని అంటున్నారు. అయితే బీజేపీ కూడా ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమేనని ప్రకటించింది. కానీ టీఆర్ఎస్ కున్న క్యాడర్ బీజేపీకి గ్రామాల్లో కాస్త తక్కువగానే ఉంది. దీంతో మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందస్తుకు వెళితే ఏమవుతుంది..? అని టీఆర్ఎస్ ఆలోచిస్తుంది. మరి కేసీఆర్ మొత్తంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని తెలంగాణ ప్రజానీకం ఎదురుచూస్తోంది.