లోకేష్ చాన్స్ ఇపుడు : బాల మామయ్య రుణం తీర్చుకున్నాడా...?

Mon Sep 26 2022 20:29:21 GMT+0530 (India Standard Time)

News on Nara lokesh tweet

ఏపీలో రాజకీయమే సాగుతోంది. అది కూడా దిగజారుతూ ఎక్కడికో తెలియనంతగా పోతోంది. ఒకరి మీద మరొకరు దుమ్మెత్తిపోసుకుంటూ నిందలు వేసుకుంటూ పరువులు తీసుకుంటున్నారు. వెన్నుపోటు అంటే కేరాఫ్ చంద్రబాబు అని వైసీపీ ఆరోపిస్తోంది. ఇపుడు తండ్రికి ద్రోహం చేసిన కొడుకు అని బాలయ్యని కూడా టార్గెట్ చేస్తోంది. దాంతో నారా వారి అబ్బాయి టీడీపీ భావి వారసుడు పైగా బాలయ్య అల్లుడు అయిన  లోకేష్ కి మండదా.ఆయన కూడా వెతికి పట్టుకుంటే పాత వీడియోలు బోలెడు యాంటీ జగన్ వి దొరుకుతాయి. అందుకే అర్జంటుగా ఒక దాన్ని పట్టేసుకుని వైసీపీ మీద అస్త్రంగా  ప్రయోగించేశారు. ఇంతకీ ఆ పాత వీడియో క్లిప్ ఏంటి అంటే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చట్టం ముందు కానీ ప్రజల ముందు ముద్దాయిగా నిలబెట్టింది ఆయన కుమారుడు జగన్ కాదా అని నిలదీశారు. ఆయన లాయర్ కాబట్టి లాజిక్ పాయింట్ ని కూడా లేవనెత్తారు.

ఇంతకీ జరిగింది ఏంటి అంటే ఆనాడు జగన్ అక్రమాస్తుల మీద కేసులు పడ్డాయి. దాంతో ఆయన దీని మీద సుప్రీం కోర్టుకు వెళ్లారు. తన తండ్రి వైఎస్సార్ మంత్రివర్గం తీసుకొన్న నిర్ణయాలతో తనకు ఏమిటి సంబంధం అంటూ  కేసు వేశారు. దాంతో ఆ కేసులో మొదటి ముద్దాయిగా వైఎస్సార్ పేరుని చేర్చాల్సి వచ్చింది అని ఉండవల్లి చెప్పారన్న మాట.

ఆ ఇంటర్వ్యూని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ నారా లోకేష్ తండ్రిని ముద్దాయి చేసిన కొడుకు దుర్మార్గం అంటూ ఫైర్  అయ్యారు. ఇప్పటికైనా అర్ధమైందా మీకు అంటూ వైసీపీ మీద సెటైర్లు వేశారు. దీంతో ఇపుడు వైసీపీ డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది. దీనికి కారణం ఎపుడో పాతికేళ్ల క్రితం జరిగిన ఎన్టీయార్ వెన్నుపోటులో బాలయ్య తండ్రికి ద్రోహం చేసి బాబు పక్షాన నిలబడ్డారని దానికి రిటార్ట్ అన్నట్లుగా లోకేష్ ఇలా ట్వీట్ చేశారు.

పైగా మీలా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం లేదు ఆధారాలతో చెబుతున్నాను అని ఆయన అంటున్నారు. మరి దీని మీద వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఏది ఏమైనా పిల్లనిచ్చిన బాల మామయ్య మీద వైసీపీ వారు రెండు రోజులుగా చేస్తున్న హాట్ కామెంట్స్ కి అల్లుడు లోకేష్ ఇలా హాట్ ట్వీట్ చేసి రుణం తీర్చుకున్నారన్న మాట.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.