Begin typing your search above and press return to search.

కన్నా పోటీ ఖాయంగా అక్కడి నుంచేనా?

By:  Tupaki Desk   |   30 Jan 2023 5:14 PM GMT
కన్నా పోటీ ఖాయంగా అక్కడి నుంచేనా?
X
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల తన హయాంలో నియమించిన 8 మంది జిల్లాల అధ్యక్షులను మార్చడంపై కనీసం తనకు సమాచారం ఇవ్వలేదని కన్నా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారని.. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలోని వచ్చే ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. కన్నా లక్ష్మీనారాయణతో చర్చించాలని బీజేపీ జాతీయ కార్వనిర్వాహక కార్యదర్శి శివ ప్రకాష్‌ జీని ఆదేశించింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కన్నా లక్ష్మీనారాయణతో శివ ప్రకాష్‌ జీ విజయవాడలో కన్నా లక్ష్మీనారాయణతో సమావేశమై అన్ని అంశాలను చర్చించారు.

అయితే కన్నా పార్టీ మార్పు విషయంలో కాస్త మెత్తబడ్డట్టే కనిపిస్తున్నా ఎన్నికల నాటికి మాత్రం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవచ్చనే ఆయన అనుచరులు చెబుతుండటం గమనార్హం.

ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా తప్ప కన్నా లక్ష్మీనారాయణకు మరే పదవి లేదు. ఈ నేపథ్యంలో శివ ప్రకాష్‌ జీతో భేటీ తర్వాత కన్నా లక్ష్మీనారాయణకు ప్రాధాన్యత గల పదవిని బీజేపీ అధిష్టానం అప్పగిస్తుందో, లేదో చూడాల్సి ఉంది. కన్నా సైతం కొద్ది రోజులు బీజేపీ అధిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారని అంటున్నారు. అయితే ఎన్నికల నాటికి మాత్రం కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నుంచి జనసేన తరఫున బరిలోకి దిగడం ఖాయమని అంటున్నారు.

ఇప్పటికే జనసేన–టీడీపీ పొత్తు కుదిరే అవకాశం ఉండటంతో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ లతో సైతం కన్నా లక్ష్మీనారాయణ సంభాషించారని చెబుతున్నారు. ప్రస్తుతం సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. పవన్‌ కల్యాణ్, చంద్రబాబులపై తీవ్ర విమర్శలు చేసేవారిలో అంబటి రాంబాబు ఒకరు. ఈ నేపథ్యంలో ఈసారి అంబటిని ఓడించాలని టీడీపీ, జనసేన కంకణం కట్టుకున్నాయి.

దీంతో అంబటి రాంబాబు సైతం సత్తెనపల్లిలో తనకు గెలుపు అవకాశాలు లేవని తేలిపోవడంతోనే అవనిగడ్డ నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు.

మరోవైపు టీడీపీ తరఫున సత్తెనపల్లి టికెట్‌ ను నలుగురు అభ్యర్థులు ఆశిస్తుండటం గమనార్హం. టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు వైవీ ఆంజనేయులు, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కుమారుడు కోడెల శివరాం, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబు, తెలుగు యువత నాయకుడు అబ్బూరు మల్లి వీరిలో ఉన్నారు.

అయితే పొత్తులో భాగంగా ఈ టికెట్‌ ను తమకే కేటాయించాలని పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబును కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీ నుంచి బరిలోకి దిగుతారని అంటున్నారు.

ఇక ప్రస్తుతం వైసీపీ తరఫున సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న అంబటి రాంబాబు అవనిగడ్డ నుంచి పోటీ చేస్తే సత్తెనపల్లిలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలోకి దిగొచ్చని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.