Begin typing your search above and press return to search.

సౌండ్ పార్టీలు రెడీ : సైకిల్ స్పీడ్ ని ఆపెదెవరు...?

By:  Tupaki Desk   |   2 July 2022 2:30 PM GMT
సౌండ్ పార్టీలు రెడీ :  సైకిల్ స్పీడ్ ని ఆపెదెవరు...?
X
తెలుగుదేశం పార్టీకి ఈసారి అన్ని రకాలైన ఆయుధాలు రెండేళ్ల ముందుగానే సమకూరుతున్నాయి. ఇది ఒక విధంగా పాజిటివ్ వేవ్ గా పార్టీ పెద్దలు భావిస్తున్నారు. నిజానికి దారుణంగా ఓడిన పార్టీకి అతి పెద్ద సమస్య నిధుల కొరత. ఆ పార్టీ వైపు ఎవరూ తొంగి చూడరు వంగి వాలరు. కానీ చిత్రంగా ఏపీలో వైసీపీ పాలన మూడేళ్ళు పూర్తి కాగానే భారీ వ్యతిరేకత కనిపిస్తోంది. దాంతో ఈసారి టీడీపీ మీద పందెం కాయడానికి బడా బాబులు రెడీ అవుతున్నారుట. ఈ మధ్యనే అట్టహాసంగా జరిగిన ఒంగోలు మహానాడుకి అయిన ఖర్చు చూస్తే కళ్ళు తేలేయాలి.

ఏకంగా 75 కోట్ల దాకా మహానాడుకు ఖర్చు రాసేశారు. మరి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా వచ్చింది, ఎవరు సమ‌కూర్చారు అంటే టీడీపీ అనుకూలవాదులు, వైసీపీ వ్యతిరేకులు మాత్రమే కాదు, ఏపీలో టీడీపీ జమానాలో లబ్ది పొంది ఇపుడు వైసీపీ వల్ల అసలు ఏమీ కాకుండా ఉన్న పారిశ్రామికవేత్తలు ఇపుడు చొరవ తీసుకుని ముందుకు వచ్చారని అంటున్నారు. ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్న తీరున వారు అంతా కసిగా టీడీపీ కోసం తెర వెనక పనిచేస్తున్నారు అని అంటున్నారు.

ఆ మధ్య దాకా ఏ కార్యక్రమం చేపట్టాలన్నా టీడీపీకి ఆర్ధిక వనరుల కొరత పట్టి పీడించేంది. ఇక కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్ వంటి వారు పార్టీని వీడాక ఆ సమస్య ఇంకా ఎక్కువ అయింది. ఇంకో వైపు వైసీపీ రాజకీయ దూకుడు, వరస విజయాలతో టీడీపీ మీద అపనమ్మకం కూడా నిన్నటిదాకా ఉంటూ వచ్చింది.

కానీ ఇపుడు ఒక్కసారిగా సీన్ మారుతోంది. ఏపీలో గాలి మార్పుని పసిగట్టిన వారంతా టీడీపీ గుర్రం మీద పందెం కాస్తే రాజకీయ లాభమే అన్న అంచనాకు వచ్చేస్తున్నారు. దాంతో అధినాయకత్వం కూడా ఫుల్ ఖుషీ అవుతోంది. వచ్చే ఎన్నికలు మామూలుగా జరగవు, అంగబలం, అర్ధబలం రెండూ జోడు కడితేనే గెలుపు పిలుపు వినిపిస్తుంది.

అంగబలం పరంగా టీడీపీకి ఢోకా లేకపోయినా అర్ధ బలం మాత్రం కాస్తా డౌట్ గానే ఉంది. ఇపుడు ఆ లోటు కూడా తీరిపోయింది అంటున్నారు. దాంతోనే చంద్రబాబు జిల్లాలలో మినీ మహానాడులు జరిపేందుకు రెడీ అవుతున్నారు. ఈ మినీ మహానాడులకు కూడా ఒక్కోదానికి పది కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతోందిట. అంటే మొత్తం 26 జిల్లాలు అంటే అక్షరాలా రెండు వందల అరవి కోట్ల రూపాయలు అన్న మాట.

ఇంత పెద్ద మొత్తాన్ని భరించేవారు తెర వెనక ఉన్నాఉ కాబట్టే టీడీపీ బే ఫికర్ గా తన దూకుడు సాగిస్తోంది అంటున్నారు. అయితే ఇక్కడ మరో డౌట్ కూడా వస్తోందిట. ఎన్నికలు చూస్తే రెండేళ్ళ దాకా లేవు. ఇపుడే వందల కోట్లు బయటకు తీస్తే అసలు వేళకు ఎలా అన్నదే ఆ బెంగ. దానికి కూడా టీడీపీ పెద్దలు మాస్టర్ ప్లాన్ రెడీ చేశారుట. ఇపుడే గట్టిగా జనంలోకి తిరిగి మూడ్ చేంజి చేస్తే ఎన్నికల వేళకు టీడీపీకి అనుకూలంగా భారీ వేవ్ స్టార్ట్ అవుతుందని, ఆ వేవ్ లో పోటీకి సిద్ధపడేవారు తాముగానే అర్ధబలంతో ముందుకు వస్తారు అని లెక్కలు కడుతోంది.

మొత్తానికి ఒక సినిమా రిలీజ్ కి ముందు ఎంతటి హడావుడి ఉంటుందో. పాజిటివ్ బజ్ కోసం మేకర్స్ ఎంతలా తపన పడతారో రాజకీయాల్లో కూడా అలాంటి ట్రెండ్ కి టీడీపీ తెర తీస్తోంది అంటున్నారు. అనుకున్నట్లుగానే మహానాడుని సూపర్ సక్సెస్ చేసిన టీడీపీ జనాల్లో తమ పార్టీ మీద పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేసుకుంది. ఆ ఊపుని ఎన్నికల వరకూ కంటిన్యూ చేయడానికి సౌండ్ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఇక సైకిల్ స్పీడ్ ని ఆపెదెవరు, అడ్డెదెవరు అని పసుపు సిబిరం పొలికేక పెడుతోంది అంటే ఆలోచించాల్సిందే కదా.