Begin typing your search above and press return to search.

కొత్త రికార్డు: ఒక్కరోజుకే హైదరాబాద్ లో అన్ని కేసులా?

By:  Tupaki Desk   |   18 Jun 2020 7:51 AM GMT
కొత్త రికార్డు: ఒక్కరోజుకే హైదరాబాద్ లో అన్ని కేసులా?
X
కోటికి పైగా ప్రజలున్న హైదరాబాద్ మహానగరం ఇప్పుడు వణుకుతోంది. మొన్నటివరకూ ఫర్లేదన్నట్లుగా ఉన్న మహా నగరం ఇప్పుడు అందుకు భిన్నంగా ఉన్న పరిస్థితి. మాయదారి రోగానికి సంబంధించిన ఇప్పటివరకూ ఎప్పుడూ లేని ఒక చెత్త రికార్డు ఒకటి నమోదైంది. హైదరాబాద్ లో మాహమ్మారి తీవ్రత ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని తెలియజేసే ఈ వైనం ఇప్పుడు గుబులు రేపుతోంది. ఒక్కరోజులో డబుల్ సెంచరీ దాటేసిన పాజిటివ్ కేసులతో కొత్త కంగారు షురూ అయినట్లే.

ఆ మధ్య దాకా ముప్ఫై.. యాభై.. డెబ్భై పాజిటివ్ లు నమోదైన స్థానే.. కొద్ది రోజులుగా వందకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. ఇందుకు భిన్నంగా బుధవారం సరికొత్త రికార్డును క్రియేట్ చేసేలా ఒక్కరోజులో 214 పాజిటివ్ కేసులు నమోదు కావటం చూస్తే.. పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్న విషయాన్ని స్పష్టం చేస్తుందని చెప్పాలి. కేసులు భారీగా పెరిగిన ఊరట కలిగించే అంశం.. మరణాలు పెద్దగా లేకపోవటమే.

హైదరాబాద్ మహానగరంలో ఇంత భారీగా పాజిటివ్ లు నమోదు కావటానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విధానమే ఇంత భారీగా కేసులు నమోదు కావటానికి కారణమంటున్నారు. పదిరోజుల్లో యాభైవేల నిర్దారణ పరీక్షలు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర సర్కారు.. హైదరాబాద్ దాని చుట్టుపక్కల ఉన్న ముప్ఫై అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరీక్షల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కారణంగానే.. కొత్త పాజిటివ్ లు ఇంత భారీగా నమోదై ఉంటాయని భావిస్తున్నారు. ఈ పరీక్షలు మరికొన్ని రోజులు కొనసాగించనున్న నేపథ్యంలో.. రానున్న రోజుల్లో పాజిటివ్ లు మరిన్ని పెరగటం ఖాయమంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్రమత్తత మాత్రమే హైదరాబాదీయులకు శ్రీరామ రక్షగా చెప్పక తప్పదు.

గ్రేటర్ పరిధిలో 214 కేసులు నమోదైతే.. తెలంగాణ వ్యాప్తంగా 269 పాజిటివ్ లునమోదయ్యాయి. రంగారెడ్డిలో పదమూడు.. వరంగల్ అర్బన్ లో 10.. కరీంనగర్ లో ఎనిమిది.. జనగామలో ఐదు.. ములుగులో ఐదు.. మెదక్ లో మూడు.. సంగారెడ్డిలో మూడు.. వనపర్తిలో రెండు.. మేడ్చల్ లో రెండు.. జయశంకర్ భూపాల పల్లి.. ఆసీఫాబాద్.. మహబూబ్ నగర్.. వికారాబాద్ లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో పాజిటివ్ లు నమోదైన నేపథ్యంలో తెలంగాణలో పాజిటివ్ ల సంఖ్య 5675కు చేరుకుంటే.. యాక్టివ్ కేసులు 2412గా ఉంది.