Begin typing your search above and press return to search.

ఎన్నికల ఖర్చుపై కొత్త మార్గదర్శకాలు.. ఎంపీ..ఎమ్మెల్యేలు ఎంత ఖర్చు చేయొచ్చంటే?

By:  Tupaki Desk   |   20 Oct 2020 7:45 AM GMT
ఎన్నికల ఖర్చుపై కొత్త మార్గదర్శకాలు.. ఎంపీ..ఎమ్మెల్యేలు ఎంత ఖర్చు చేయొచ్చంటే?
X
కాలం మారింది. అందుకు తగ్గట్లే చాలా అంశాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ.. ఎన్నికల సమయంలో బరిలో నిలిచిన అభ్యర్థులు అధికారికంగా పెట్టాల్సిన ఖర్చుకు సంబంధించిన లెక్కలకు.. వాస్తవంగా పెట్టే ఖర్చుకు ఏ మాత్రం సంబంధం ఉండదన్నది తెలిసిందే. ఇలాంటివేళలో అయినా.. కాస్త పరిమితిని పెంచితే.. ఖర్చు లెక్కలు కొంతమేర అయినా బయటకు వస్తాయి. అయినప్పటికీ.. నిబంధనల్లో మాత్రం మార్పులు ఎంత ఆచితూచి అన్నట్లు బయటకు వస్తాయన్నది తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే అర్థం కాక మానదు.

ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.50 లక్షలు నుంచి రూ.70 లక్షల వరకు ఖర్చు చేసే వీలుంది. దేశంలోని వివిధ లోక్ సభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ఆయా ప్రాంతాలకు తగ్గట్లుగా ఎంత ఖర్చు చేయాలన్నది లెక్కలు ఉన్నాయి. అదే విధంగా అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికలకు పెట్టాల్సిన ఖర్చు మీద కూడా లెక్కలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులు 20 నుంచి 28 లక్షల రూపాయిల వరకు ఖర్చు చేసే వీలుంది.

తాజాగా ఈ పరిమితిని సవరిస్తూ కేంద్ర న్యాయశాఖ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం దేశంలోని 25 రాష్ట్రాల్లోని లోక్ సభ స్థానాలకు రూ.77 లక్షలు.. అసెంబ్లీ స్థానాలకు రూ.30.80 లక్షలు ఖర్చు చేసేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే.. కొన్ని రాష్ట్రాలకే ఈ సవరణ చేసిన ఖర్చు ఉంటుంది.మరికొన్నిప్రాంతాలకు అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా ఎన్నికల ఖర్చు పరిమితిని సవరించారు. ఉదాహరణకు అరుణాచల్ ప్రదేశ్.. గోవా.. సిక్కింలతో పాటు ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఎంపీస్థానాలకు పోటీ చేసే వారు పెట్టాల్సిన ఖర్చు రూ.59.4 లక్షలు మాత్రమే. అదే సమయంలో ఇదే ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు రూ.22లక్షల లోపే ఎన్నికల ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అదే సమయంలో ఢిల్లీ లో లోక్ సభ ఎన్నికలకు రూ.77లక్షలు.. అసెంబ్లీ ఎన్నికలకు రూ.30.8లక్షలు ఖర్చు చేసే వీలుంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రాలకు జరిగే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.70లక్షలు.. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు రూ.30.8లక్షలు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇలా కొన్నిరాష్ట్రాల్లో ఒకలాంటి ఖర్చు.. మరికొన్ని రాష్ట్రాల్లో మరికాస్త ఎక్కువ ఖర్చుపెట్టేందుకు వీలుగా సవరణలు చేశారు. తాజాగా చేసిన సవరణలకు.. వాస్తవ ఖర్చులకు మధ్య పోలికే లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.