Begin typing your search above and press return to search.

పక్కా వ్యూహంతోనే కొత్త జిల్లాలు... ?

By:  Tupaki Desk   |   28 Nov 2021 8:30 AM GMT
పక్కా వ్యూహంతోనే కొత్త జిల్లాలు... ?
X
వేసుకునేందుకు నూనె లేదు కానీ నెయ్యి కావాలన్నాడట వెనకటికి ఒకడు. అలా ఉంది ఏపీ వ్యవహారం. ఏపీ ఖజానా చూస్తే పైసా కొత్తగా రాలడంలేదు, కానీ ఏలికల ప్రకటనలు మాత్రం భారీగానే ఉన్నాయి. ఏపీలో మూడు రాజధానుల కధ అయితే ప్రస్తుతానికి ముగిసింది. మళ్లీ ఎపుడు కొత్త బిల్లు పెడతారో ఎవరికీ తెలియదు. ఆ సంగతి పక్కన పెట్టిన వైసీపీ పెద్దలు ఇపుడు కొత్త జిల్లాలు అంటున్నారు. నిజానికి ఇది పాత మాటే. ఎన్నికల వేళ, పాదయాత్ర సమయాన జగన్ ఇచ్చిన హామీగా దీన్ని చూడాలి. అయితే హామీలన్నీ అమలు చేయలా అంటే అవకాశాలు, వీలూ అన్నీ చూసుకోవాలి.

ఇక ఏపీలో పదమూడు జిల్లాలు ఉన్నాయి. అదే భౌగోళికంగా జనాభా పరంగా ఏపీ కంటే చిన్నదైన రాష్ట్రంగా ఉన్న తెలంగాణాకు 33 జిల్లాలు ఉన్నాయి. మరి ఏపీకి కూడా పెరగాలి కదా అన్న మాట ఉంది. పెరిగితే లాభం ఏంటి అంటే పాలనాపరంగా సదుపాయాల కోసమట. ఆ విధంగా ఆలోచిస్తే జగన్ తెచ్చిన గ్రామ వార్డు సచివాలాయలు ఉన్నాయి. అంతే కాదు, రెవిన్యూ డివిజన్లు ఉన్నాయి. అర్డీవోకు, సబ్ కలెక్టర్ల వ్యవస్థ కూడా ఉంది. ఎన్ని ఉన్నా కూడా కలెక్టరేట్ ఉంటేనే మేలు అనుకున్నా దానికి కావాల్సిన వనరులు ఇతర భారాలు ఎవరు మోస్తారు.

ఇదే ఇపుడు ప్రశ్నగా ఉంది. ఏపీలో కొత్తగా మరో పదమూడు జిల్లాలను ఏర్పాటు చేసే విషయం మీద ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా దృష్టి సారించారు అన్న వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇది ఏడాది క్రితమే కొద్దిగా కదిలింది. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆద్వార్యాన కమిటీని కూడా వేశారు. ఆ నివేదికలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఇంతలో కేంద్రం జన గణన ముందుకు రావడంతో ఇది వెనక్కి వెళ్ళింది. అయితే ఇపుడు జన గణనకు ఇబ్బంది లేకుండా సమాంతరంగా కొత్త జిల్లాల కసరత్తు మొదలెట్టాల‌ని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లుగా చెబుతున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటుతో కేంద్ర నిధులు దండీగా వస్తాయన్న భావన పాలకులకు ఉన్నట్లుంది. అయితే కేంద్రం నిధులు ఎలా ఇస్తుందో తెలిసిన వారు ఎవరూ ఈ రకంగా పేరాశలు పెట్టుకోరు అన్న మాట ఉంది. ఇక కొత్త జిల్లాల పేరిట అయ్యే ఖర్చు చూస్తే తడిసి మోపేడు అవుతుంది. కేంద్రం నిధులు సరిగ్గా ఇవ్వకపోతే వాటి నిర్వహణ పెను భారం అవుతుంది. మరి ఈ సంగతి తెలిసి కూడా దూకుడు చేయడం అంటే దాని వెనక పక్కాగా రాజకీయ కారణాలే ఉన్నాయని అనుకోవాలి. రాజకీయమేంటి అంటే ఇపుడు చంద్రబాబు ఏడుపు గొట్టు రాజకీయాన్ని అర్జంటుగా జనం దృష్టి నుంచి మళ్ళించడం. మరో వైపు జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారని చాటింపు వేసుకోవడం.

ఇక ముచ్చటగా మూడవది ఇంపార్టెంట్ అయినది. అదేంటి అంటే జిల్లాలను ముక్క‌లుగా విడగొట్టి రాజకీయాన్ని తమకు అనుకూలం చేసుకోవడం. అంటే టీడీపీ ప్రభావితమైన జిల్లాలు, ప్రాంతాలను చీల్చడం ద్వారా ఆ పార్టీ ప్రయోజనలను దెబ్బ తీయడం. ఇలా రాజకీయంగా ఆలోచించే ఈ ప్రతిపాద‌నను తెర ముందుకు తెస్తున్నారు అన్న విమర్శలు అయితే ఉన్నాయి. ఇప్పటికే అన్ని రకాలుగా ఆర్ధికంగా చితికిన ఏపీకి కొత్త జిల్లాల వల్ల ఖర్చు తప్ప కలసి వచ్చేది ఏదీ లేదని విశ్లేషణలు అయితే ఉన్నాయి.