Begin typing your search above and press return to search.

కరోనాను పీచమణిచిన దేశం..వంద రోజులుగా ఒక్క కేసు లేదు

By:  Tupaki Desk   |   9 Aug 2020 1:30 PM GMT
కరోనాను పీచమణిచిన దేశం..వంద రోజులుగా ఒక్క కేసు లేదు
X
అక్కడెక్కడో వూహాన్ మహానగరం కోవిడ్-19 కారణంగా శ్మశానంగా మారిందన్నప్పుడు ప్రపంచం పెద్దగా పట్టించుకోలేదు. చైనా ప్రభుత్వం రహదారులన్ని మూసేసి.. ప్రజల్ని ఇళ్లల్లో నుంచి రానివ్వకుండా చేస్తూ.. వీధులన్ని పెద్ద ఎత్తున పిచికారీ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చినప్పుడు ఆశ్చర్యపోయినోళ్లు చాలామందే ఉన్నారు. మరీ.. ఎక్కువ చేస్తున్నారని ఫీలైనోళ్లు ఉన్నారు. చైనాలో అంతే.. చైనాలో అంతే అన్నట్లుగా కామెడీ చేసుకున్నోళ్లు తక్కువేం కాదు.

ప్రపంచానికి వూహాన్ ఒక వార్నింగ్ ఇచ్చిందన్న విషయాన్ని అర్థం చేసుకునే సరికి జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. తీరిగ్గా కూర్చొని.. ఎంత పెద్ద తప్పు చేశాం.. చిన్నపాటి నిర్లక్ష్యానికి ఇంత భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందే అంటూ ఫీల్ కాని పాలకులు లేరు. కాకుంటే.. ఎవరికి వారు తాము చేసిన తప్పును ఒప్పుకోకుండా.. తేలు కొట్టిన దొంగల్లా ఉండిపోతున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తంలో అత్యంత దారుణంగా ఫెయిల్ అయిన సంస్థ ఏదైనా ఉందంటే.. చెప్పాల్సి వచ్చేది ప్రపంచ ఆరోగ్య సంస్థనే.

కోవిడ్ రావటమే కానీ వెళ్లటం ఉండదని.. అది సాధ్యమయ్యే వ్యవహారం కాదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. దీనికి తగ్గట్లే.. వూహాన్ తో సహా.. పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చినట్లే వచ్చి.. మళ్లీ కరోనా కేసులు నమోదు కావటం చూస్తున్నాం. కానీ.. అందుకు భిన్నంగా కరోనాకే కత్తెరేసిన బుజ్జి దేశంగా న్యూజిలాండ్ నిలిచింది. మిగిలిన దేశాల మాదిరే కరోనా కారణంగా కాసిన్ని కేసులు నమోదైనా..అక్కడి ప్రభుత్వం వెంటనే స్పందించి.. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు ఫలించాయి. అక్కడి ప్రభుత్వానికి న్యూజిలాండ్ వాసులు సైతం దన్నుగా నిలిచారు.

దీంతో.. కరోనాను జయించిన దేశంగా న్యూజిలాండ్ అప్పుడెప్పుడో అవతరించింది. తాజాగా.. దీనికి సంబంధించి మరో రికార్డును సొంతం చేసుకుంది. కరోనా ఒకసారి వచ్చాక.. మళ్లీ వెళ్లిపోవటం అంత సులువైన విషయం కాదు. దాని మూలాలు ఎక్కడో ఒకచోట పుట్టుకొస్తూ ఉంటాయి. న్యూజిలాండ్ లో మాత్రం అందుకు భిన్నంగా.. అలాంటిదేమీ లేకుండా ఉండటం గమనార్హం. గడిచిన వంద రోజుల్లో ఆ దేశంలో ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కావటం గమనార్హం. దీంతో.. ప్రభుత్వంపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికిప్పుడు న్యూజిలాండ్ లో కేవలం 23 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా కరోనా రోగులు దేశంలోకి అడుగుపెట్టే సమయంలో గుర్తించినవే తప్పించి.. ఆ దేశంలో ఉన్న వారు కాదు. ఇంత సాధించినా.. తాము విశ్రమించమని.. చిన్నపాటి ఆలసత్వం కూడా ప్రదర్శించటానికి వీల్లేదని వ్యాఖ్యానించటం గమనార్హం. న్యూజిలాండ్ సాధించిన అరుదైన రికార్డును చూసి ప్రపంచ దేశాలు అచ్చెరువు చెందుతున్నాయి. ప్రశంసల వర్షం కరిపిస్తున్నాయి. మరి.. న్యూజిలాండ్ మాదిరి మిగిలిన ప్రపంచం కావాలన్నది ఇప్పటికైతే అత్యాశే అవుతుంది కదూ?