మోడీ సర్కారును ఇరుకున పడేలా న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం

Sat Jan 29 2022 17:33:31 GMT+0530 (IST)

New York Times sensational article to narrow down the Modi government

మరో రెండేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. అనూహ్య రీతిలో ప్రఖ్యాత అమెరికా మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ షాకింగ్ కథనాన్ని పబ్లిష్ చేసింది. దేశ వ్యాప్తంగా ఐదురాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. యూపీ పీఠం ఎంత కీలకమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విడుదలైన మీడియా రిపోర్టులు.. సర్వే నివేదికలన్నీ బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వెల్లడించటం తెలిసిందే.అయితే.. అందుకు భిన్నమైన పరిస్థితి క్షేత్ర స్థాయిలో ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. కొద్ది నెలల క్రితం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పెగాసస్ స్పైవేర్ ఇష్యూ బయటకు రావటం.. మోడీ సర్కారు ఇరకాటంలో పడటం.. అతి కష్టమ్మీదా బయటకు రావటం తెలిసిందే. అయితే.. సమిసిపోయిందనుకున్న వివాదం మళ్లీ రేగేలా అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ తాజాగా సంచలన కథనాన్ని వెలువరించింది. ఇందులో పెగాసస్ డీల్ ను భారత్ ఓకే చేసిందని పేర్కొనటంతో పాటు సంచలన వివరాల్ని వెల్లడించింది.

దీంతో.. ఇదో హాట్ టాపిక్ గా మారింది. కీలకమైన ఎన్నికల వేళ.. మోడీ సర్కారు కొనుగోలు చేసిన ఈ స్పైవేర్ రాజకీయ సంచలనంగా మారటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెగాసస్ తయారీ సంస్థ ఎస్ఎస్ వోతో తాము ఎలాంటి లావాదేవీలు జరపలేదని కేంద్రం తేల్చిన వేళలో.. ఆ మాటలన్ని తప్పు అని చెప్పేలా తాజా  పరిశోధనాత్మక కథనం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఇంతకీ పెగాసస్ స్పైవేర్ విషయానికి వస్తే.. ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ వో గ్రూపు రూపొంచిందిన ఈ స్పైవేర్ ను కొన్ని దేశాలు వినియోగించటం తెలిసిందే. దీని ద్వారా రాజకీయ ప్రముఖులు..జర్నలిస్టులు.. మానవ హక్కుల కార్యకర్తలపై నిగా పెట్టినట్లుగా జులైలో అంతర్జాతీయ మీడియాలో కథనం రావటం పెను దుమారానికి కారణమైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరు.. విపక్షానికి చెందిన రాహుల్ గాంధీతో పాటు.. పలువురు రాజకీయ నేతలు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో పాటు దేశంలోని దాదాపు 300 మంది ఫోన్లను పెగాసన్ హ్యాక్ చేసినట్లుగా ధి వైర్ సంచలన కథనాన్ని బయటకు తెచ్చింది.

ఇది కాస్తా సంచలనంగా మారటమే కాదు.. పార్లమెంట్ ను కుదిపేసింది. దీనికి సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే.. ఇందులో వాస్తవం లేదని అప్పట్లో కేంద్రం కొట్టిపారేసింది. తమ మీద వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తేల్చింది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరటం.. కేంద్రం పెగాసస్ ను వినియోగించిందా? లేదా? అన్న దానిపై విచారణకు దేశ అత్యున్నత న్యాయస్థానం ముగ్గురు సభ్యులతో ఇండిపెండెంట్ కమిటీని ఏర్పాటు చేసింది.

పెగాసస్ ఇష్యూ మీద తాము ఏడాది పాటు రహస్య పరిశోధన చేశామని పేర్కొన్న న్యూయార్క్ టైమ్స్ తమ సంచలన కథనంలో పలు సంచలన అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చింది.

-  ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ వో సంస్థ గత పదేళ్ల కాలంలో నిఘా సాఫ్ట్ వేర్ లను సబ్ స్క్రిప్షన్ విధానంలో చట్టసభలు.. నిఘా సంస్థలకు అమ్ముతోంది.
-  అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు ఈ స్పైవేర్ ను అమ్మినప్పటికి దాన్ని వినియోగించలేదు.
-  2017 జులైలో భారత దేశ ప్రధాని ఇజ్రాయెల్ వెళ్లారు. ఒక భారత ప్రధాని ఆ దేశానికి వెళ్లటం అదే తొలిసారి.
-  ఆ సమయంలోనే ఇరుదేశాల మధ్య ఆధునాతన ఆయుధాలు.. సాంకేతిక మార్పిడి కోసం ఇజ్రాయెల్ తో మోడీ రెండు బిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
-  ఆ డీల్ లోనే పెగాసస్ కు సంబంధించిన వ్యవహారం ఉంది.
-  ఈ ఒప్పందం జరిగిన కొన్ని నెలల తర్వాత అప్పటి ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ భారత్ లో పర్యటించారు.
-  2019 జూన్ లో ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు అబ్జర్వర్ హోదాపై జరిగిన ఓటింగ్ లో ఇజ్రాయెల్ కు అనుకూలంగా భారత్ ఓటేసింది.

దీనిపై కేంద్ర ప్రభుత్వ స్పందన కోరగా ఎలాంటి సమాధానం రాలేదని పీటీఐ వార్తా ఏజెన్సీ స్పష్టం చేసింది. ఈ నివేదిక పూర్తి నిరాధారమని జాతీయ మీడియా కథనాలు చెప్పినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఈ వివాదం సమిసిపోయే అవకాశం లేదంటున్నారు. కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రచురితమైన ఈ సంచలన కథనం జాతీయ రాజకీయాల్లో రగడగా మారటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.