తెలంగాణ తెరపై ఇంకో నయీం...హైదరాబాద్ పరిసరాలే టార్గెట్

Mon May 27 2019 10:49:31 GMT+0530 (IST)

New Naeem In Telangana

గ్యాంగ్ స్టర్ నయీం గురించి పరిచయం అవసరం లేదు. ఆయన జీవించి ఉన్నపుడు సృష్టించిన అక్రమాల పరంపర నేటికి అనుచరుల రూపంలో కొనసాగుతూనే ఉంది. అయితే అదే ఒరవడిలో..మరో  నయా నయీం వెలుగులోకి వచ్చాడు. అచ్చంగా నయీంలాగే హైదరాబాద్ పరిసరాల్లో భూకబ్జాలకు పాల్పడుతున్నాడు. పదేళ్ల క్రితం సామాన్య లారీడ్రైవర్ గా పనిచేసిన ప్రస్తుతం కోట్లకు పడగలెత్తాడు. హైదరాబాద్ ను ఆనుకొని ఉన్న వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలో ఇలా హల్ చల్ చేస్తున్న నయా నయీం పేరు  ఉమర్ ఖాన్.20 మంది గ్యాంగ్ తో తిరుగుతూ విలువైన భూముల కబ్జాకు పాల్పడే ఉమర్ ఖాన్.. దాదాపు 200 ఎకరాలను కబ్జాచేసినట్లు ఆరోపణలున్నాయి. కొందరు పోలీసు రెవెన్యూ అధికారులతోపాటు ప్రజాప్రతినిధుల అండదండలతో అతడు కబ్జాలకు పాల్పడుతున్నట్టు బాధితులు చెప్తున్నారు. తమ భూములను కబ్జాచేశాడు.. తమకు న్యాయంచేయాలంటూ వెళ్తే పట్టించుకోని పోలీసులు - రెవెన్యూ అధికారులు.. కార్యాలయానికి ఉమర్ ఖాన్ వస్తే రాచమర్యాదలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమర్ ఖాన్ తో కలిసి స్థానిక ఎస్ ఐ భూదందా నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉమర్ ఖాన్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన బాధితులపై రెవెన్యూ - పోలీస్ అధికారులు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తుండటం గమనార్హం.

తమ భూములు కబ్జా అయ్యాయని ఓ రెవెన్యూ డివిజన్ ఉన్నతాధికారి వద్దకువెళ్తే.. ``అతని వెంట గ్యాంగ్ ఉంది.. మిమ్మల్ని ఏమైనా చేస్తారు.. మీ భూములను వదిలేసుకొని వెళ్లండి`` అంటూ కబ్జాదారుడు ఉమర్ ఖాన్ కు మద్దతుగా సదరు అధికారి మాట్లాడినట్టు బాధితులు చెప్తున్నారు. కబ్జాకు గురైన తమ భూముల కోసం బాధితులు ఎదురుతిరిగితే సంబంధిత కుటుంబంపై దాడులు చేసి - చంపుతామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూడూర్ మండలం చన్గొముల్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో భూకబ్జాలకు గురైన ఏ ఒక్కరూ ఉమర్ ఖాన్ గురించి వివరాలు చెప్పేందుకు ముందుకు రావడంలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్థంచేసుకోవచ్చు. గత పదేళ్లుగా పోలీస్ స్టేషన్ - రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి ఆలసిపోయిన కొందరు బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు న్యాయం చేసి తమ భూములను తిరిగి ఇప్పించాలంటూ ఓ మీడియా సంస్థను ఆశ్రయించడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

ఈ నయా నయీం వెంటుండి ప్రోత్సహిస్తున్న పోలీసు - రెవెన్యూ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడంతోపాటు బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం జిల్లా కలెక్టర్ తోపాటు ఎస్పీపై ఎంతైనా ఉందంటున్నారు. ఈ విషయంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించినట్టయితే ఇంకా చాలామంది ఉమర్ ఖాన్ బాధితులు బయటకు వచ్చే అవకాశముందని బాధితులు పేర్కొంటున్నారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.