పీచే మూడ్..అమిత్ షా అతీతుడేమీ కాదు!

Wed Sep 18 2019 22:27:11 GMT+0530 (IST)

రాజకీయాల్లో కొనసాగుతున్న వారిలో చాలా మందికి యూటర్న్ అవసరమన్న మాట మరోమారు రుజువైందనే చెప్పాలి. యూటర్న్ అనే పదం విన్నంతనే మనందరికీ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడే గుర్తుకు వస్తారు. తాజాగా బాబు మాదిరే మరో కీలక నేత పేరు కూడా ఈ జాబితాలో చేరిపోయిందనే చెప్పాలి. ఆ నేత ఆషామాషీ నేత కాదు... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగానే కాకుండా నరేంద్ర మోదీ కేబినెట్ లో నెంబర్ టూ హోదాలో కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న అమిత్ షా ఇప్పుడు యూటర్న్ నేతల జాబితాలో చేరిపోయారు. తాను చేసిన వ్యాఖ్యలను తానే ఖండిచేసి... అసలు ఆ మాట నేనెప్పుడూ అనలేదంటూ చాలా సింపుల్ గా యూటర్న్ తీసేసుకున్నారు.ఒకే దేశం- ఒకే భాష అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు యావత్తు దేశంలో పెను కలకలమే రేపాయి. ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల నుంచి ప్రత్యేకించి ప్రాంతీయ తత్వం బాగానే ఒంటబట్టించుకున్న తమిళనాడు రాష్ట్రాల నుంచి అమిత్ షా వ్యాఖ్యలకు తీవ్ర నిరసన వ్యక్తమైంది. బీజేపీపై ఇప్పటిదాకా ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడని సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నిరసన గళం విప్పేశారు. ఇక డీఎంకే లాంటి పార్టీలు అయితే... చెప్పాల్సిన పనే లేకుండా అమిత్ షా తీరుపై విరుచుకుపడ్డాయి. దీంతో అమిత్ షా కూడా యూటర్న్ తీసుకోక తప్పలేదు.

అంతకంతకూ పెరిగిపోతున్న ఈ వివాదానికి తెరదించాలని భావించిన అమిత్ షా... ‘హిందీ’ని జాతీయభాషగా మార్చాలని తానెప్పుడూ అనలేదని మాట మార్చేశారు. ప్రాంతీయ భాషలను పక్కన పెట్టాలనే ఆలోచన కూడా తమకు లేదని స్పష్టం చేశారు. రెండో భాషగా మాత్రమే హిందీని నేర్చుకోవాలని చెప్పాను తప్ప పైవిధంగా తాను వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. హిందీయేతర భాషా రాష్ట్రం నుంచే తాను కూడా వచ్చానని - తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఎవరైనా రాజకీయాలు చేయాలని చూస్తే వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఓ కామెంట్ అలా పడేసి సర్దేసుకున్నారు.