Begin typing your search above and press return to search.

ఆ మాటలతో అడ్డంగా బుక్ అయిన ఆ దేశ ప్రధాని

By:  Tupaki Desk   |   26 Nov 2020 5:00 AM GMT
ఆ మాటలతో అడ్డంగా బుక్ అయిన ఆ దేశ ప్రధాని
X
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు మాట్లాడేటప్పుడు ఆచితూచి అన్నట్లు వ్యవహరించాలి. లేదంటే అనవసరమైన వివాదంలోకి కూరుకుపోవటమే కాదు.. అందరిచేత మాట అనిపించుకోవాల్సిన దుస్థితి. డిజిటల్ విప్లవానికి ముందు.. సమాచారం ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్లటానికి చాలా సమయమే పట్టేది. ఇప్పుడు అలా కాదు.. అముదాల వలసలో కూర్చొని కూడా అమెరికా రాజకీయాల మీదా.. అక్కడి వారి చేష్టల మీద సోషల్ మీడియాలో ఉతికి ఆరేసే వీలుంది. అంతేకాదు.. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు ఉంది.

ఇలాంటివేళ.. మాటలు జాగ్రత్తగా మాట్లాడటం చాలా అవసరం. కానీ.. ఇజ్రాయల్ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు తప్పులో కాలేశారు. చెప్పే మాటల్ని.. తీసుకున్న ఉదాహరణ విషయంలో జరిగిన పొరపాటుతో ఆయనో వివాదంలో కూరుకుపోవటమే కాదు.. పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నారు. మహిళలపై జరిగే హింసకు వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..ఆ కార్యక్రమ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడి తిట్లు తింటున్నారు.

నిజంగానే ఆయన కావాలని మాట్లాడారా? అంటే లేదనే చెప్పాలి. తన మనసులోని భావాన్ని మాటల్లోకి బదిలీ చేసే క్రమంలో చోటు చేసుకున్న తప్పే ఈ పరిస్థితికి కారణంగా చెప్పాలి. ‘‘నువ్వు కొట్టటానికి మహిళ జంతువు కాదు.. మనమంతా జంతుహింస తగదని చెబుతాం. వాటి మీద అప్యాయత కురిపిస్తాం. జాలి చూపిస్తాం. మహిళలు.. పిల్లలు కూడా జంతువులే. అందులోనూ హక్కులున్న జంతువులు’’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

అయితే.. జరిగిన పొరపాటు ఏమిటంటే.. నువ్వు కొట్టానికి మహిళ జంతువు కాదన్న వరకు ఫర్లేదు.. ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలన్ని అభ్యంతరకరమే. వాస్తవానికి ఆయన తన భావాన్ని విడమర్చి చెప్పే క్రమంలో జరిగిన తప్పే తాజా వివాదానికి కారణంగా చెబుతున్నారు. నోరు లేని మూగజీవాల పట్ల అప్యాయత.. జాలి చూపిస్తాం.. అలాంటిది మానవజాతికి మూలమైన మహిళను మరెంత మర్యాద ఇవ్వాలి? ఇంకెంత గౌరవం ఇవ్వాలన్న మాటకు బదులుగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఇజ్రాయల్ ప్రధాని మాటల్ని ప్రతి ఒక్కరు తిట్టిపోస్తున్న పరిస్థితి.