రాయుడిపై నోటి దురుసు..ఆ కామెంటర్ ని ఆటాడుకుంటున్న ఫ్యాన్స్

Mon Sep 21 2020 12:20:26 GMT+0530 (IST)

Netizens Fires On Sanjay Manjrekar

మాజీ క్రికెటర్  ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మరోసారి వివాదాన్ని రేపారు. ఎప్పుడు  ఏదో ఒకరిపై మాట పారేసుకోవడం ఆ తర్వాత  విమర్శల పాలవడం ఆయనకు అలవాటుగా మారినట్లుంది. ఇప్పుడు మరోసారి రాయుడు పీయూష్ చావ్లా లపై  కామెంట్స్ చేసి నెటిజన్ల ట్రోలింగ్ కి గురవుతున్నాడు. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ కు బీసీసీ ఐ బోర్డు ఏడుగురు వ్యాఖ్యాతలతో కూడిన సభ్యుల బృందాన్ని  ఎంపిక చేసింది. అయితే అందులో వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ పేరు లేదు. ఐపీఎల్ కి దూరమైనా  సంజయ్  నోటి దురుసు తగ్గించుకో లేదు. ముంబై -చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ లో  అద్భుతంగా రాణించిన రాయుడు పీయూష్ చావ్లాను  పొగుడుతూనే వారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు.ఆట ముగియగానే సంజయ్ ట్వీట్ చేస్తూ ' లో ప్రొఫైల్ క్రికెటర్లు అంబటి రాయుడు  పీయూష్ చావ్లా ఆట తీరు అద్భుతం పీయూష్ చావ్లా ఐదు 16వ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక రాయుడు నాణ్యమైన ఆట తీరుతో ఐపీఎల్ లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడని' ట్వీట్ చేశాడు. ఈ కామెంట్స్ లో పొగడ్తలు వరకూ  ఓకే కానీ.. వారిద్దరినీ  లో ప్రొఫైల్ ఆటగాళ్ల గా అభివర్ణించడం తో విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా అంబటి రాయుడు ఫ్యాన్స్ సంజయ్ ని టార్గెట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారు. 'రాయుడు లో ప్రొఫైల్ ఆటగాడు  కాదు.. తక్కువగా  అంచనా వేసిన ఆటగాడని ఒకరంటే అసలీ లో ప్రొఫైల్స్ డిసైడ్ చేసేది ఎవరూ..  అని మరొకరు అతడు ప్రపంచ కప్ గెలిచిన సభ్యుల్లో ఒకరిని మర్చిపోవద్దని.. మరొకరు సంజయ్ ని విమర్శిస్తూ  కామెంట్లు పెట్టారు.  నోటి దురుసుతో  ఇప్పటికే ఐపీఎల్ లో  వ్యాఖ్యాతగా చోటు కోల్పోయినా  సంజయ్ కి బుద్ధి రాలేదని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

గత ప్రపంచ కప్ లో జడేజా అద్భుతంగా రాణించినా సంజయ్ అతడిపై విమర్శలు  చేయగా.. జడేజా అందుకు గట్టిగానే బదులిచ్చాడు. ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఫస్ట్ క్లాస్ క్రికెట్ కానీ.. లిస్ట్ క్రికెట్ కానీ ఆడలేదని నోరు పారేసుకుని అందరితో తిట్లు తిన్నాడు. ఇలా రోజూ ఎవరో ఒకరితో తిట్లు తినందే సంజయ్ కి గడవదేమోనని క్రికెట్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.