నోట్ల రద్దు+ జీఎస్టీ+ కరోనా = మోడీ విఫలమయ్యారా?

Mon Apr 19 2021 11:00:01 GMT+0530 (IST)

Netizens Fires On Pm Modi

దేశంలో పెద్ద నోట్ల రద్దు - గుడ్స్ - సర్వీస్ ట్యాక్స్ - కరోనా.. వంటి విషయాల్లో ప్రపంచమే తనను మెచ్చిందని చెప్పుకొనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విఫలమయ్యారా? ఆయన విధానాలు.. సర్వభ్రష్టత్వంగా మారాయా?  దేశవ్యాప్తంగా ప్రజలు గగ్గోలు పెడుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు ఆర్థిక నిపుణులు.. పరిశీ లకులు. ఇదే విషయంపై ఇప్పుడు దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు మోడీ వేషధారణతో అందరిని మసిబూసి మారేడు కాయ చేశారని అంటున్నారు. నిజానికి ఇంతకంటే కూడా.. ఆయన తన మాటల ధాటితో అందరినీ తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారనేది నిజం.కానీ ఆ వేషాలు ఆ మాటలు.. ఎల్లకాలం వాస్తవ పరిస్థితిని కప్పి ఉంచలేవు. అదే ఇప్పుడు బయట పడిపోయింది. దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా దెబ్బతిందో స్పష్టం చేస్తోంది. ఇవే విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఆహా వోహో.. అన్న వారే ఇప్పుడు మోడీ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయిందని ఆర్థిక నిపుణులు చెబుతు న్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల.. దేశంలో ప్రతి వ్యక్తికీ.. రూ.15 లక్షలు వస్తాయని.. ప్రతి వ్యక్తి జన్‌ధన్ ఖాతా ఓపెన్ చేసుకోవాలని.. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

కానీ.. పేదల చెంతకు ఒక్కరూపాయి కూడా చేరలేదు. ఇక జీఎస్టీ విషయానికి వస్తే.. ఈ విధానం మొత్తం.. దేశ పన్నులు విధానాన్నే సమూలంగా మారుస్తుందని ప్రచారం చేసినా.. రాష్ట్రాల అధికారాలు ఆర్థిక వ్యవ స్థను సైతం కేంద్ర ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుంది. దీంతో కేంద్రం దయపై రాష్ట్రాలు బతకాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రాలకు రావాల్సిన చట్టబద్ధమైన పన్నుల వాటా విషయంలోనూ కేంద్రంలోని మోడీ సర్కారు తొండి చేస్తోంది. సరిగా ఇవ్వడం లేదని.. ఆర్థిక నిపుణుల నుంచి వస్తున్న ప్రధాన విమర్శ. ఇక రాష్ట్రాలు సైతం ఎప్పటికప్పుడు కేంద్రం ముందు నిలబడి `మావాటా మాకివ్వండి!` అని దేబిరించే పరిస్థితి కనిపిస్తూనే ఉంది.

ఇక ఏలిన వారి పాలనలో.. కరోనా సైతం ప్రజలకు చుక్కలు చూపించింది. కరోనా ఎఫెక్ట్‌ను తక్కువగా అంచనా వేయడంతోపాటు.. చప్పట్లు కొట్టడం.. దీపాలు పెట్టడం.. పళ్లాలు కొట్టడం.. వంటి పనులతో సరిపెట్టారు. ఇక వ్యాక్సిన్ విషయానికి వస్తే.. ఆది నుంచి కూడా శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ సహకరించింది ఏమీ లేదు. వారికి కనీసం ఆర్థికంగా సహాయం చేసింది  కూడా లేదు. అయినప్పటికీ.. శాస్త్రవేత్తలు సొంతంగానే తమ ప్రయోగాలు సాగించారు. ఫలితంగా ఇప్పుడు వ్యాక్సిన్ లేకుండా పోయిందనే వాదన వస్తోంది.

ఇలా.. మొత్తానికి  ఈ పరిణామాలను గమనిస్తే..  ప్రధాని మోడీ వారి ఏలుబడి.. దురదృష్టకరమని పెద్ద ఎత్తున టీవీ చర్చల్లో మేధావులు ఆర్థిక నిపుణులుసైతం చెప్పేస్తుండడం గమనార్హం. ఈ చర్చలకు లైకులు.. కూడా ఎక్కువగా వస్తుండడం గమనార్హం. అంటే.. మోడీపై దేశంలో వ్యతిరేకత పెరిగిందనే చెప్పాలి. ఇక బీజేపీ కేడర్ మాత్రం.. మోడీ భజనలో మునిగి.. తరిస్తోంది. ఆయనను ఏమైనా అంటే.. దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తూ.. కామెంట్లు పెట్టడం.. వారిపై వికృత వ్యాఖ్యలు చేయడం.. ఇప్పుడు బీజేపీ సోషల్ మీడియా పనిగా ఉందని అంటున్నారు పరిశీలకులు.  మొత్తానికి మోడీవారి ఘనత వహించిన పాలన లో ఈ దేశం పరిస్థితి ఇదీ!!