షర్మిల వస్తే కానీ పవన్ కు చురుకు పుట్టలేదా?

Mon Mar 01 2021 09:26:48 GMT+0530 (IST)

Netizens Fires On Pawan Kalyan

అనుకోవటానికి ఎన్నైనా అనుకోవచ్చు. మాటల్లో వినిపించే గాంభీర్యత చేతల్లో చూపించటం అంత తేలికైనది కాదు. అందునా రాజకీయాల్లో అదేమాత్రం ఈజీ కాదు. మాటల్లో సినిమా చూపించే పవన్ కల్యాణ్.. చేతల్లోకి వచ్చేసరికి ప్రతిసారీ తేలిపోవటం ఎక్కువైందన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. దీనికి తగ్గట్లే ఆయన పార్టీ తీరు ఉండటం గమనార్హం. రాష్ట్ర విభజన వేళ.. కొత్తగా పురుడుపోసుకున్న జనసేన.. రెండు రాష్ట్రాల్లో ఉంటుందన్న మాటను పవన్ చెప్పినా.. చేతల్లో చూసినప్పుడు ఏపీ మీద పెట్టిన ఫోకస్ తెలంగాణ మీద పెట్టలేదు పవన్ కల్యాణ్.ఆ మధ్యలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన మీద ఫస్ట్ క్లాస్ మార్కులు వేసినట్లుగా మాట్లాడటం పలు సందేహాలకు తావిచ్చింది. ఆ మధ్య జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి దిగేది దిగేది ఖాయమనే అంటూ హడావుడి చేసి.. అంతలోనే సైలెంట్ అయిపోవటం తెలిసిందే. ఏపీలోనే తన సత్తా చాటలేకపోతున్న పవన్.. తెలంగాణలో పార్టీ ఉనికి అంతంతమాత్రమే.

అలాంటిది తాజాగా పార్టీ మహిళా విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్.. తెలంగాణ మీద ఫోకస్ చేయనున్నట్లుగా చెప్పటం కనిపించింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తీరు.. నిర్వహించిన విధానం చూస్తే.. ఎవరో ఏదో చెబితే.. తప్పనిసరి పరిస్థితుల్లో చేసినట్లే ఉంది తప్పించి.. నిర్మాణాత్మకంగా వ్యూహాత్మకంగా చేపట్టినట్లుగా లేకపోవటం గమనార్హం.

నిజానికి పార్టీని విస్తరించాలన్న కాంక్షే ఉంటే..ఆ పనిని ఒక పద్దతి ప్రకారం చేయాల్సి ఉంటుంది. పార్టీకి ఒక మోస్తరు బలం ఉన్న ఏపీలోనే ఇప్పటివరకు అలాంటిది చేసింది లేదు. ఇక.. తెలంగాణలో ఎప్పటికి అయ్యేట్లు? ఇటీవల ఏర్పాటు చేసిన వీర మహిళ మీటింగ్ లో పవన్ మాటలు ఏదో తెచ్చి పెట్టుకున్నట్లుగా కనిపించాయే తప్పించి.. మనస్ఫూర్తిగా పవన్ చెప్పినట్లుగా కనిపించలేదు.

తెలంగాణలో ఇప్పటివరకు యాక్టివ్ గా లేని పవన్.. ఉన్నట్లుండి.. మాంచి నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచినట్లుగా అంత హడావుడిగా తన కార్యాచరణను ప్రకటించేలా సమావేశాన్ని నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్నది మరో ప్రశ్న. తెలంగాణలో రాజన్న కుమార్తె షర్మిల కొత్త పార్టీని ఏర్పాటు చేయటానికి సిద్ధం కావటం.. పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ.. వ్యూహాత్మకంగా ముందుకెళుతున్న వేళలోనే జనసేన ఒక్కసారిగా యాక్టివ్ కావటం గమనార్హం.

షర్మిల వచ్చిందని.. తర్వాత జగన్ వస్తారని.. ఆ తర్వాత చంద్రబాబు వస్తారంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నట్లుగా..షర్మిల పార్టీ.. మరోవైపు జనసేన పార్టీ.. ఇలా అన్ని ఆంధ్రా పార్టీలేమిటి తెలంగాణలో అన్న భావన కలిగించేలా ఉన్నట్లు చెబుతున్నారు. చూస్తుంటే.. షర్మిల పార్టీ ఏర్పాటుకు జోరుగా ప్రయత్నాలు సాగుతున్న వేళలోనే.. జనసేన యాక్టివ్ కావటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.