Begin typing your search above and press return to search.

ఆర్‌.. కృష్ణ‌య్య కాస్తా.. అరెరె.. కృష్ణ‌య్యా! అయ్యారే!!

By:  Tupaki Desk   |   7 Dec 2022 9:30 AM GMT
ఆర్‌.. కృష్ణ‌య్య కాస్తా.. అరెరె.. కృష్ణ‌య్యా! అయ్యారే!!
X
బీసీ సామాజిక వ‌ర్గాలను ముందుండి న‌డిపించిన ఆర్. కృష్ణ‌య్యకు ఒక ఇమేజ్ ఉంది. బీసీ వాద‌న‌, వారి హ‌క్కుల కోసం పోరాడిన నాయ‌కుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే, రాజ‌కీయ ఒర‌వ‌డిలో చిక్కుకున్న ఆయ‌న‌.. ఇప్పుడు ఆయ‌న‌ను ఆర్‌. కృష్ణ‌య్య‌గా కంటే కూడా.. ``అరెరె కృష్ణ‌య్యా`` అనే కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌న్లు. దీనికి కార‌ణం.. ఏ ఎండకు ఆ గొడుగు అన్న‌చందంగా ఆయ‌న మారిపోవ‌డ‌మే.

వైసీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న కృష్ణ‌య్య , తాజాగా విజ‌యవాడ‌లో వైసీపీ నిర్వ‌హించిన బీసీ స‌భ‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ‌తంలో ఆయ‌న ధ‌రించిన బీసీ వ‌ర్గ నాయ‌కుడి పాత్ర‌ను పోషిస్తార‌ని అందరూ అనుకున్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా కాక‌పోయినా.. అంతో ఇంతో బీసీల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తార‌ని లెక్క‌లు వేసుకున్నారు. అయితే, ఆయ‌న ఫ‌క్తు జ‌గ‌న్ భ‌జ‌న‌లో తేలిపోయారు.

ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే. బీసీలను అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు. ఏపీలో బీసీలకు ఆత్మగౌరవాన్ని కల్పించింది జగనే అని చెప్పుకొచ్చారు. పదకొండు మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు. కానీ, ప‌ద‌వుల‌కు అధికారం ఇవ్వ‌లేద‌న్న విమ‌ర్శ‌ల‌పై మాత్రం స్పందించ‌లేదు.

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టిన ఘనత జగన్‌దేన‌న్న ఆయ‌న త‌ర్వాత ఏం జ‌రిగిందో మాత్రం చెప్ప‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు అది ఎక్క‌డా ప్ర‌స్తావ‌న‌కు కూడా రాలేదు.

``ఎన్నో ఉద్యమాలు చేశా.. బీసీ కేంద్రమంత్రుల్ని కలిశా. కానీ, ఎవరూ సీఎం జగన్‌లా కృషి చేయలేదు`` అని కృష్ణ‌య్య చెప్పుకొచ్చారు. అయితే, జ‌గ‌న్‌కు ఉన్న పొలిటిక‌ల్ థ్రెట్ వారికి ఉండ‌క‌పోవ‌చ్చు.. అందుకే కృష్ణ‌య్య‌పై అంతులేని ప్రేమ కురిపించి.. ఆయ‌న‌ను మ‌చ్చిక చేసుకుని ప‌ద‌వి ఇచ్చి ఉండ‌క‌పోవ‌చ్చు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

బీసీలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు అని కూడా కృష్ణ‌య్య వ్యాఖ్యానించారు. ఒక్కసారి గ‌తంలోకి వెళ్తే.. 2014లో టీడీపీ త‌ర‌ఫున తెలంగాణ‌లో పోటీ చేసిన‌ప్పుడు కూడా చంద్ర‌బాబును ఇలానే ఆకాశానికి ఎత్తేశార‌ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. సీఎం జగన్‌ ఓ సంఘ సంస్కర్త అని అన్నారు. ప‌ద‌వులు ఇచ్చాక .. ఆ మాత్రం ఆకాశానికి ఎత్త‌క పోతే ఎలా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.