Begin typing your search above and press return to search.

మోడీకి బిగ్ షాక్ .. వెనక్కి తగ్గేదేలేదంటున్న నేపాల్ ప్రధాని !

By:  Tupaki Desk   |   19 Nov 2019 7:10 AM GMT
మోడీకి బిగ్ షాక్ .. వెనక్కి తగ్గేదేలేదంటున్న నేపాల్ ప్రధాని !
X
వరుసగా రెండోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అంచనాలకి మించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. రెండోసారి అధికారంలోకి రాగానే ..గత కొన్నేళ్లుగా ఉన్న జమ్మూ , కాశ్మీర్ పై కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 31న భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత అధికారికంగా భారతదేశం యొక్క మ్యాప్ విడుదల చేసింది.

ఈ మ్యాప్‌ లో ఉత్తరాఖండ్, నేపాల్ మధ్య ఉన్న కాలాపానీ, లిపు లేఖ్ ప్రాంతాలు భారత్‌లో ఉన్నట్టు చూపించారు. దీనిపై నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ యువ విభాగం నేపాల్ యువ సంగమ్‌ ను ఉద్దేశించి కేపీ ఓలీ మాట్లాడారు. మా భూమిలో ఒక్క అంగుళం కూడా ఇతరుల ఆక్రమణలో ఉండటాన్ని మేం అనుమతించం. భారత్ వెంటనే అక్కడి నుంచి వైదొలగాలి అని చెప్పారు. కాలాపానీని భారత మ్యాప్‌లో చూపించడంపై వారం రోజులుగా నేపాల్‌లో నిరసనలు జరుగుతున్నాయి. ఈ విషయంలో ఆ దేశ అధికార పార్టీతో పాటు, విపక్షాలు ఒకే అభిప్రాయంతో ఉన్నాయి.

కానీ, కొత్త మ్యాప్‌ లో సరిహద్దులకు సంబంధించి ఎలాంటి సవరణలూ లేవని, కేవలం జమ్మూకశ్మీర్ విషయంలో వచ్చిన మార్పులను మాత్రమే చూపించామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు. కొత్త మ్యాప్‌ లో నేపాల్‌ తో భారత సరిహద్దులను సవరించలేదు. నేపాల్‌ తో ఉన్న సరిహద్దు పరిమితులు ఇంతకు ముందున్న వ్యవస్థ ప్రకారమే ఉన్నాయి. మా మధ్య ఉన్న సన్నిహిత, స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలతో చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు కట్టుబడి ఉంటామని మరోసారి చెబుతున్నాం అని తెలిపారు. ఈ మ్యాప్‌ను మేం ఏకపక్షంగా ప్రచురించలేదు. ప్రతి ఏటా మేం మ్యాప్ విడుదల చేస్తుంటాం. 2018, లేదంటే అంతకు ముందు ఉన్న మ్యాప్‌లు చూడండి. కాలాపానీ భారత్‌ లోనే కనిపిస్తుంది అని చెప్పారు.

మా ప్రాంతం నుంచి విదేశీ సైనికులు వెనక్కి వెళ్లాలి. మా భూమిని రక్షించుకోవడం మా బాధ్యత , ఇంకొకరి ప్రాంతం మాకు అవసరం లేదు, మా పొరుగువారు కూడా మా ప్రాంతంలో ఉన్న సైనికులను వెనక్కి పిలిపించుకోవాలి అని ఓలీ అన్నారు. అసలు కాలాపానీ అంటే ఏమిటంటే .. కాలీ నది పుట్టే ప్రాంతమే కాలాపానీ. భారత్ విడుదల చేసిన తాజా మ్యాప్‌లో ఈ నదిని కూడా చూపించారు.1816లో ఈస్ట్ ఇండియాతో చేసుకున్న సుగౌలీ ఒప్పందం ప్రకారం కాలాపానీ, లిపు లేఖ్‌ తమకు చెందుతాయని నేపాల్ అంటోంది.